సాక్షి,హైదరాబాద్: నగర శివార్లలోని నాదర్గుల్ మాటూరి వెంకట సుబ్బారావు (MVSR) ఇంజినీరింగ్ కాలేజీలో దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఉత్సాహంగా దాండియా నృత్యాలు చేస్తుండగా.. భారీ లైటింగ్ సిస్టమ్ అమర్చిన ఇనుప క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులు, సిబ్బంది భారీ ఎత్తున చేరి దాండియా నృత్యాల్లో మునిగిపోయిన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పెద్ద శబ్దంతో లైటింగ్ సిస్టమ్ కుప్పకూలడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి వాతావరణం నెలకొంది. ఈ ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం, తోటి విద్యార్థులు అప్రమత్తమయ్యారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని వెలికితీసి, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. లైటింగ్ సిస్టమ్ ఏర్పాటులో నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా, లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీలో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో విద్యార్థుల కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


