సాక్షి, హైదరాబాద్: రామంతాపూర్‌లో జ్యువెలరీ వ్యాపారి కిడ్నాప్ కేసులో పోలీసులు విజయవంతమయ్యారు. తీవ్ర సంచలనాత్మక కేసులో 10 మంది సభ్యుల ముఠాను చిక్కడపల్లి పోలీసులు,సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చాకచక్యంగా ఈ రోజు (శనివారం) అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి (రూ. కోటి ఏడు లక్షల) నగదు, 118.26 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 వాహనాలు (3 కార్లు, 2 ద్విచక్రవాహనాలు) 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో పలువురికి గతంలో కిడ్నాప్, దోపిడీ, చీటింగ్ వంటి తీవ్రమైన నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు.
ఏం జరిగింది?
రామంతాపూర్‌లో జ్యువెలరీ వ్యాపారం నిర్వహించే కె. శ్రీనివాసరావు (53) అనే వ్యక్తి 05.10. 2026న షాపుకు వెళ్తూ కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిక్కడ్పల్లి పోలీసులు 'మ్యాన్ మిస్సింగ్' (Cr. No. 298/2026) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బొడుప్పల్ హేమానగర్లోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌కు సంబంధించి బాధితుడు శ్రీనివాసరావుకు ప్రధాన సూత్రధారి A1 దుమావత్ శ్రీకాంత్‌కు మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఆ వెంచర్ AGPని తన పేరిట రాయించుకోవడంతో పాటు భారీగా డబ్బు గుంజాలని A1 శ్రీకాంత్ ఆగస్టు 2026లో A2 సురేష్, A3 శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కిడ్నాప్ కుట్ర పన్నాడు.
ప్లాన్ ప్రకారం, గోల్నాక ఫ్లైఓవర్ వద్ద పోలీసులుగా నటించి వ్యాపారి శ్రీనివాసరావును బలవంతంగా అపహరించారు. కళ్లకు గంతలు కట్టి అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. మొదట రూ. 15 కోట్లు డిమాండ్ చేసి, చివరికి కుటుంబ సభ్యుల నుంచి రూ. 1.30 కోట్లు రాన్సమ్ (పరిహారం) వసూలు చేసిన తర్వాత బాధితుడిని వదిలేశారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు ఉపయోగిస్తూ, పదే పదే వాహనాలు మార్చారు. అయినప్పటీకీ పోలీసులు విజయవంతంగా ఈ కేసును ఛేదించారు.
ఈ ఆపరేషన్‌ను సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ వైభవ్ గైక్వాడ్, అడిషనల్ డీసీపీ . నరసయ్య, చిక్కడపల్లి ఎసీపీ . రణవీర్ రెడ్డి గారి పర్యవేక్షణలో చిక్కడ్పల్లి సీఐ ఎల్. మధుబాబు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, కాచిగూడ డిఐ రాఘవేంద్ర, చిక్కడ్పల్లి డీఎస్ఐ కరీంతో పాటు ఇతర సిబ్బంది కలిసి ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
సంచలనాత్మకమైన ఈ కిడ్నాప్ కేసును తక్కువ సమయంలో ఛేదించి, రూ. కోటికి పైగా నికర నగదుతో పాటు నిందితులను పట్టుకున్న అధికారులను, సిబ్బందిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి, పురస్కారాలు ప్రకటించారు.
ఇదీ చదవండి: జూనియర్ జడ్జ్‌గా ఎంపికైన శ్రీవల్లి


