చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది తెలుగు నానుడి... ప్రమాదం ఎంత చిన్నదైనా సరే దాన్ని తక్కువ అంచనా వేయవద్దని, తేలికగా తీసుకోవద్దని అర్థం. పాము పిల్లేకదా అని చేతితో పట్టుకుని పారెయ్యబోతే దాని కాటుకు ఓ యువకుడు బలైన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా... శంషాబాద్ డివిజన్ సాదత్ కాలనీలో నివాసముండే ఎలక్ట్రీషియన్ మహ్మద్ సల్మాన్ (33) తన స్నేహితుడు అమ్రుల్లాతో కలిసి నాలుగురోజుల కిందట రాత్రి సమయంలో గోల్డెన్ వెంచర్ కాలనీలోని ఖాళీ ప్రదేశంలో కూర్చుని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో ఓ పాము పిల్ల వారున్న చోటికి రావడంతో పాము పిల్లే కదా అని తేలికగా తీసుకున్న సల్మాన్ దానిని చేతితో పట్టుకుని దూరంగా పడేయబోయాడు. అంతలోనే పాము అతడి ఎడమచేతి బొటన వేలుపై కాటు వేసింది.
సల్మాన్ను వెంటనే స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పిక్కపట్టిన పక్కింటి కుక్క


