కర్ణాటక: దిండు కింద నాగుపాము ఉన్న సంగతి కూడా తెలియని అన్నాచెల్లెలు ఇద్దరూ రాత్రంతా అదే దిండు మీద పడుకున్న సంఘటన బాగలగుంటెలోని భైరవేశ్వర నగర్‌లో చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న కుటుంబం రాత్రి పడుకునే ముందు కిటికీ తీసి పడుకున్నారు. కిటికీలోంచి లోపలకు వచ్చిన నాగుపాము ఒకటి ఇల్లంతా తిరిగి చివరకు బెడ్‌రూంలో అన్నాచెల్లెలు పడుకున్న దిండు కిందకు చేరి తోక ముడుచుకుని పడుకుంది.
అన్నాచెల్లెలు ఇద్దరికీ రాత్రి రెండు మూడు సార్లు ఒంటిమీద ఏదో పాకినట్టు అనిపించిందని, అయితే మామూలుగా ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటాయి కాబట్టి ఎలుకలుగా భావించి అలాగే నిద్రపోయారు. ఉదయం నిద్రలేచి దిండు తీయగా కింద నాగుపాము తోక ముడుచుకుని సేద తీరుతోంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ నాగేంద్రకు ఫోన్ చేసారు. తక్షణం అక్కడకు వచ్చిన నాగేంద్ర పాముని సురక్షితంగా పట్టుకున్నాడు.


