పాలమూరుకు ఏపీ ఓకే! | AP Water Resources Special Chief Secretary Attends Amit Shah-Chaired Meeting | Sakshi
Sakshi News home page

పాలమూరుకు ఏపీ ఓకే!

Oct 18 2026 5:03 AM | Updated on Oct 18 2026 5:03 AM

AP Water Resources Special Chief Secretary Attends Amit Shah-Chaired Meeting

నక్కలగండి ప్రాజెక్టుకు సైతం సమ్మతి.. అయితే తాము చేపట్టిన పోలవరం–బనకచర్లకు అంగీకరించాలంటూ మెలిక

అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడిన ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌ 

పోలవరం–బనకచర్లలో పాలమూరు, నక్కలగండి భాగమేనని వెల్లడి 

పాలమూరుపైనే కాకుండా ప్రాజెక్టులన్నింటిపై చర్చించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు  

‘గోదావరి–కావేరి’ పరిష్కారమైతే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి: సీడబ్ల్యూసీ 

రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే విధంగా ఉండరాదు: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఇచ్చిపుచ్చుకునే విధానంలో జల వివాదాలను పరిష్కరించుకోవాలి: అమిత్‌ షా 

ఆగస్టులో జరిగిన మహాబలిపురం భేటీ మినట్స్‌లో ఈ విషయాలు పొందుపరిచిన కేంద్ర హోంశాఖ

సాక్షి, హైదరాబాద్‌:  శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించడానికి తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, 30 టీఎంసీల నక్కలగండి ప్రాజెక్టులకు సమ్మతి తెలిపేందుకు సిద్ధమేనంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. అయితే ఏపీలో తాము ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు తెలంగాణ అంగీకరించాలనే మెలిక పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో గత ఆగస్టు 20న తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. 

కేంద్రం ప్రతిపాదించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చలో ఏపీ తరఫున ఆయన మాట్లాడారు. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు ప్రణాళికకు..తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు అన్నివిధాలుగా సరితూగుతుందని చెప్పారు. తెలంగాణ చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులు కూడా ఈ ప్రణాళికలో భాగమేనని పేర్కొన్నారు. మహాబలిపురం సమావేశంలో చర్చించిన అంశాలతో రూపొందించిన మినట్స్‌లో కేంద్ర హోంశాఖ ఈ విషయాలను పొందుపరిచింది. ఈ మినట్స్‌ను ఇటీవల రాష్ట్రాలకు పంపింది. 

రాష్ట్రాలు పరస్పరం చర్చించుకోవాలి: చంద్రబాబు 
ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ .. ఇది దక్షిణ భారతదేశపు అనుసంధానమని, ఒకవేళ పూర్తయితే గోదావరి జలాలు పోలవరం నుండి కృష్ణాకు, కృష్ణా నుంచి బనకచర్లకు, బనకచర్ల నుండి కావేరికు తరలివెళ్తాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి వినియోగంలో వెసులుబాటు లభిస్తుందని అన్నారు. వరదలప్పుడు రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చని, కరువులో ఇది ఒక గొలుసుకట్టు వ్యవస్థలా పనిచేస్తుందని పేర్కొన్నారు. 

పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై ఇదే సమావేశంలో జరిగిన మరో చర్చలో..ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా ట్రిబ్యునల్‌–2 వెలుపల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా అని అమిత్‌షా ఆరా తీయగా, చంద్రబాబు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయని, వాటిని విడిగా పరిగణించలేమని ఆయన చెప్పారు. ఇలా ఒక్కో ప్రాజెక్టుకు అనుమతులను పరిశీలిస్తే ఈ ప్రక్రియకు ఎప్పటికీ అంతు ఉండదని అన్నారు. రాష్ట్రాలు ఈ విషయాలపై పరస్పరం చర్చించుకుని, ఆ తర్వాత కేంద్ర జలశక్తి శాఖ వద్దకు రావాలని సూచించారు.  

గోదావరి–కావేరితో ‘పాలమూరు’కీ పరిష్కారం: సీడబ్ల్యూసీ 
    కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు మాట్లాడుతూ, గోదావరి–కావేరి అనుసంధాన సమస్య పరిష్కారమైతే, పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రస్తుత సమస్యతో సహా అనేక ఇతర సమస్యలూ పరిష్కారమవుతాయని తెలిపారు. తెలంగాణ తరఫున సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంశం కృష్ణా ట్రిబ్యునల్‌–2 పరిధిలో పెండింగ్‌లో ఉన్నందున, కేంద్ర జలశక్తి శాఖ రంగంలోకి దిగి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయతి్నస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

గోదావరి–కావేరి అనుసంధానం మూలం ఇచ్ఛంపల్లి / సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉండేలా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి తెలిపారు. నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని, అయితే అది తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే విధంగా ఉండరాదని భట్టి స్పష్టం చేశారు.  

ఇచ్చిపుచ్చుకునే విధానంలో పరిష్కరించుకోండి: అమిత్‌షా 
    అమిత్‌షా మాట్లాడుతూ.. చిన్న సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని, ఆ తర్వాత పెద్ద సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయని తెలిపారు. రాష్ట్రాలే స్వయంగా చర్చలు జరపాల్సి ఉంటుందన్నారు. నదీ జలాల సమస్యలను పరిష్కరించుకోవడానికి, నీరు సముద్రంలోకి  వృధాగా పోకుండా నిరోధించడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ ముందున్న నీటి సంబంధిత అంశాలన్నింటినీ కలిపి పరిశీలించాలని, ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమస్యల పరిష్కారానికి సమగ్ర చర్చల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు.

 రాష్ట్రాలు వీలైనంత వరకు కృష్ణా ట్రిబ్యునల్‌–2 తీర్పు కోసం ఎదురుచూడకుండా, సానుకూల దృక్పథంతో పరస్పర చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియలో జలశక్తి శాఖ కీలక పాత్ర పోషించాలని, కేంద్ర హోం, జలశక్తి శాఖల కార్యదర్శులు అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఉమ్మడి ఏపీ, కర్ణాటక, తమిళనాడు మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ 2012లో కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఇచ్చిన తీర్పును అమల్లోకి తెస్తూ సత్వరంగా నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు జలశక్తి శాఖ కృషి చేయాలని, అవసరమైతే అటార్నీ జనరల్‌ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆదేశించారు.

 ఇదే ట్రిబ్యునల్‌లో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై జరుగుతున్న ప్రక్రియను సైతం వేగిరం అయ్యేలా చూడాలన్నారు. జలవివాదాల పరిష్కారానికి అవసరమైతే కేంద్ర హోంశాఖ, జలశక్తి శాఖల మంత్రులు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశమై చర్చిస్తారని అమిత్‌షా తెలిపారు.  

శుభవార్త వినిపిస్తామని గతంలోనే చెప్పిన సీఎం రేవంత్‌ 
    ‘ప్రాజెక్టులపై పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. సత్ఫలితాలు రాబోతున్నాయి. త్వరలో మంచి వార్తలు వినిపించబోతున్నాం. 90 టీఎంసీల పాలమూరు–రంగారెడ్డి, 20 టీఎంసీల డిండి ఎత్తిపోతల పథకాలకు నికర జలాలు ఇవ్వడానికి సమ్మతి తెలిపి ఎన్‌ఓసీ ఇస్తేనే తదుపరి చర్చలు ఉంటాయి..’ అని గత జూన్‌ 5న మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం గమనార్హం. రెండు ప్రాజెక్టులకు ఏపీ సమ్మతి సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల ఫలితాలొస్తున్నాయని అప్పట్లోనే ఆయన వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement