‘సాక్షి’ కథనంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పందన
సిస్టమ్ జనరేటెడ్ ‘ఫారం–7’లతో 73 లక్షల ఓట్ల తొలగింపుపై పూర్తిగా మౌనం
తొలగింపునకు ముందు ఈఆర్వోలు నోటీసు బోర్డుపై జాబితాలు ప్రదర్శించని అంశంపై సైతం..
తొలగించడానికి ముందు ఓటర్లకు షోకాజ్ జారీ చేయని అంశం కూడా..
బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగారని, విచారణ తర్వాతే ఏఎస్డీడీ ఓటర్లుగా నిర్ధారణ జరిగిందని వివరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), 2026లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్ ‘ఈఆర్వో నెట్’లో గుట్టుగా సిస్టమ్ జనరేటెడ్ ‘ఫారం–7’ దరఖాస్తులను సృష్టించి మరీ రాష్ట్రంలోని 73 లక్షల మంది ఓటర్లను తొలగించిన అంశంపై వివరణ ఇవ్వకుండా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి.సుదర్శన్రెడ్డి దాటవేశారు.
‘ఓటు..ఔటు’ అనే శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఓటు తొలగించేందుకు సిస్టమ్ జనరేటెడ్ ‘ఫారం–7’ దరఖాస్తులను వినియోగించిన అంశాన్ని సీఈఓ ఆ ప్రకటనలో తోసిపుచ్చడం కానీ అంగీకరించడం కానీ చేయలేదు. ఓటర్ల నమోదు నిబంధనలు, 1960 ఉల్లంఘనకు సంబంధించి ‘సాక్షి’ లేవనెత్తిన పలు కీలక అంశాలపై సరైన లేకుండానే ప్రకటన విడుదల చేశారు. ఆయా అంశాలపై లిఖితపూర్వకంగా వివరణ ఇస్తే ఇప్పటివరకు గుట్టుగా ఉంచిన ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించినట్టు అవుతుందనే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఓటర్లకు అవకాశం ఇవ్వలేదనడం అవాస్తవం: సీఈఓ
ఓటర్ల తొలగింపునకు ముందు వారికి సహేతుకమైన అవకాశం ఇవ్వలేదని ‘సాక్షి’ కథనంలో పేర్కొన్న అంశాన్ని సీఈఓ తోసిపుచ్చారు. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు డోర్లాక్ ఉన్న ఇళ్లలో ఫారాలు జారవేశారని తెలిపారు. ఆన్లైన్లో ఫారాలు సమర్పించే అవకాశం కల్పించామన్నారు. విచారణ తర్వాతే ఫారాలు తిరిగి ఇవ్వలేకపోయిన ఓటర్లను ఆబ్సెంటీ, షిఫ్టెడ్, డూప్లికేట్, డెడ్ ఓటర్లుగా గుర్తించి తొలగించినట్టు పేర్కొన్నారు.
వీటికి సరైన సమాధానాలు ఏవీ?
⇒ బీఎల్ఓలు ఇంటింటికీ తిరగకపోవడంతో భారీగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కాకుండా మిగిలిపోయాయి. వీటితో పాటు నిర్దేశిత గడువులోగా ఫారాలు నింపి ఇవ్వని 73,39235 మంది ఓటర్లను అచూకీ లేదు/శాశ్వతంగా నివాసం మారారు/చనిపోయారు/మరోచోట ఓటు కలిగి ఉన్నారని పేర్కొంటూ.. బీఎల్ఓలు తమ ‘బీఎల్ఓ యాప్’లో రీమార్కు రాశారు.
⇒ ఈ రీమార్కుల ఆధారంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) ..‘ఈఆర్వో నెట్’ అనే కేంద్ర ఎన్నికల సంఘం సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా 73,39235 ఫారం–7 దరఖాస్తులను ఆయా ఓటర్ల పేర్లతో గుట్టుగా జనరేట్ చేసి వారందర్నీ ఓటర్లుగా తొలగించారు.
⇒ సాధారణ ప్రజలు, తొలగించిన ఓటర్లకే కాదు ‘సర్’ ప్రక్రియలో భాగమైన చాలామంది ఉన్నతాధికారులకు సైతం ఈ ఆటో జనరేటెడ్ ఫారం–7 దరఖాస్తుల విషయం తెలియకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించింది. ఈఆర్వోలు, కొందరు ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఈ విషయంపై అవగాహన ఉన్నట్టు ‘సాక్షి’ పరిశీలనతో తేలింది.
⇒ ఈఆర్వోలు తమకు తామే ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తులు సృష్టించడం ద్వారా ఓటర్ల పేర్లను తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు.
⇒ ఓటర్ల నమోదు నిబంధనలు, 1960లోని సెక్షన్ 21(ఏ) ప్రకారం..తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు మరణించిన వ్యక్తులు, నియోజకవర్గంలో సాధారణ నివాసితులు కానివారు/కాకుండా పోయిన వారు, ఓటరుగా నమోదుకు అర్హత లేని వ్యక్తుల పేర్లు/ఇతర వివరాలతో ఈఆర్వోలు జాబితాను సిద్ధం చేయాలి. ‘ఫారం–10 నమూనా’లో ఆ జాబితాను ఈఆర్వోలు తమ కార్యాలయం నోటీసు బోర్డుపై కనీసం వారం రోజుల పాటు ప్రదర్శించాలి. ఈ పేర్ల తొలగింపుపై ఎక్కడ, ఎప్పుడు విచారణ నిర్వహిస్తారో తెలియజేయాలి. మౌఖికంగా, లిఖితపూర్వకంగా దాఖలైన అభ్యంతరాలపై విచారణ జరిపిన తర్వాతే ఆ పేర్లలో అన్నింటినీ లేదా కొన్ని పేర్లను తొలగించాలా వద్దా అని నిర్ణయించాలి. ఈ నిబంధనలేమీ పాటించకుండా రాష్ట్రంలోని 73 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.
⇒ తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు ఓటర్లను తొలగించడానికి మాత్రమే సెక్షన్ 21(ఏ) వీలు కల్పిస్తుండగా, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ దశలోనే తొలగించేశారు. ‘సాక్షి’ ప్రస్తావించిన ఈ అంశాలపై సీఈఓ సరైన వివరణ ఇవ్వలేదు.


