breaking news
removal of voters
-
ఓటు.. ఔట్
ముహమ్మద్ ఫసియొద్దీన్ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), 2026 ప్రక్రియలో భాగంగా .. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 73,39,235 మంది పేర్లను గుట్టు చప్పుడు కాకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర న్యాయశాఖ జారీ చేసిన ‘ఓటర్ల నమోదు నిబంధనలు–1960’కి అడుగడుగునా తూట్లు పొడుస్తూ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 21.7 శాతం మంది ఓటు హక్కును హరించారు.వివిధ కారణాలతో ఓటు హక్కు తొలగించే ముందు సదరు వ్యక్తుల పేర్లతో జాబితాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రతి ఒక్క ఓటరుకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఓట్ల తొలగింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వివరణ ఇచ్చుకోవడానికి సహేతుకమైన అవకాశం కల్పించాలని నిబంధనలు పేర్కొంటుండగా, ఈ ప్రక్రియ ఎక్కడా పాటించలేదు. ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు).. తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లక్షల మంది ఓటర్ల తొలగింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని ‘ఈఆర్వో నెట్’ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఆటోమెటిక్‌గా సంబంధిత ఫారం–7 దరఖాస్తులను గుప్పుచప్పుడు కాకుండా జనరేట్ చేసి ఓటర్లను తొలగించిట్టు ‘సాక్షి’ పరిశోధనలో తేలింది. 73,39,235 ఫారం–7 దరఖాస్తులు సృష్టి! సర్–2026 ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, సర్,–2026 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,213కు తగ్గిపోయింది. అంటే ముసాయిదా జాబితాలో 73,3,9235 మంది పేర్లు చేరలేదన్న మాట. ఈ మేరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో.. ఆ 73,3,9235 మంది (21.7శాతం) ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి వీలుగా వారందరి పేర్లతో ‘ఈఆర్వో నెట్’ పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా ఫారం–7 దరఖాస్తులను సదరు ఓటర్ల పేర్లతో ఈఆర్వోలు సృష్టించారు. ఆ విధంగా ఓటర్లుగా వారిని తొలగించారు.దీనిపై దృష్టి పెట్టిన ‘సాక్షి’ గత రెండు వారాలుగా పలువురు కీలక అధికారులను కలిసి మాట్లాడగా, వారు ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. సర్–2026 ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫున రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు కీలక అధికారులతో పాటు పలువురు ఈఆర్వోలు వీరిలో ఉన్నారు. సిస్టమ్ జనరేటెడ్ ఫారం–7 దరఖాస్తుల ఆధారంగా ఓటర్లను తొలగించిన అంశాన్ని ఎన్నికల సంఘం రహస్యంగా ఉంచింది. సాధారణ ప్రజలు, తొలగించిన ఓటర్లకే కాదు ‘సర్’ ప్రక్రియలో భాగమైన చాలామంది ఉన్నతాధికారులకు సైతం ఈ విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వినియోగించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఐటీ విభాగంలో పనిచేసే వారితో పాటు ఈఆర్వోలు, ఉన్నత స్థాయి అధికారులకు మాత్రమే ఈ విషయంపై అవగాహన ఉన్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సర్–2026 షెడ్యూల్ ప్రకారం..రాష్ట్రంలో 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 మధ్య బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి ..ఓటర్ల పేర్లు, పాక్షిక వివరాలతో ముద్రించిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ఓటర్లు ఆ ఫారాలు పూరించిన తర్వాత వెనక్కి తీసుకుంటారని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే బీఎల్ఓలు ఇంటింటికీ తిరగకుండా ఎక్కడో ఓ చోట కూర్చుని ఈ ప్రక్రియను నిర్వహించారు. సర్–2026 ప్రక్రియ చేపట్టడానికి ముందు ఉన్న మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను గడువులోగా 2,64,87,213 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను పూరించి తిరిగి బీఎల్ఓలకు అప్పగించారు.బీఎల్ఓలు ఇంటింటికీ తిరగకపోవడంతో మిగిలిన ఓటర్లలో ఎక్కువ శాతం మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అసలు పంపిణీయే కాలేదు. దీంతో వారు వాటిని పూరించి తిరిగి దాఖలు చేయలేకపోయారు. దీంతో ఎన్యూమరేషన్ ఫారాలు సమరి్పంచిన 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో మాత్రమే ఆగస్టు 17న సర్–2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించింది. ఎన్యూమరేషన్ ఫారం అందక పోవడంతో తొలగించిన 73,39,235 మంది ఓటర్ల పేర్లతో ఏఎస్‌డీడీ (ఆబ్సెంటీ (ఇళ్లల్లో లేనివారు), షిఫ్టెడ్ (నివాసం మారిన వారు), డూప్లికేట్ (రెండు ఓట్లు ఉన్నవారు), డెడ్ (చనిపోయినవారు) జాబితాను ఈసీ ప్రచురించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తొలగించిన ఓటర్లలో 9,22,229 మంది మరణించిన వారు, 11,25,546 మంది ఆచూకీ లేనివారు, 45,18,963 మంది శాశ్వతంగా నివాసం మారినవారు, 6,70,203 మంది మరోచోట ఓటు కలిగి ఉన్నవారు, 1,02,294 మంది ఇతరులున్నట్టు సీఈఓ సి.సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో సరైన పరిశీలన లేకుండానే ఈ మేరకు నిర్ధారణ చేసినట్టు విమర్శలున్నాయి. ఫారం–7 దరఖాస్తు సమర్పించకుండానే.. వీరిని తొలగించడానికి ముందు సాగిన ప్రక్రియను ఓ సారి పరిశీలిస్తే.. బీఎల్ఓలు ఇంటింటికీ తిరిగి నిర్ధారించుకోకుండానే 73,39235 మంది ఓటర్లు ఆచూకీ లేకుండా పోయారు/శాశ్వతంగా నివాసం మారారు/చనిపోయారు/మరో చోట ఓటు కలిగి ఉన్నారంటూ‘ బీఎల్ఓ యాప్’లో ఎంట్రీ చేశారు. బీఎల్ఓల రిమార్కుల ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు ..‘ఈఆర్వో నెట్’ అనే ఎన్నికల సంఘం సాఫ్ట్‌వేర్‌లో ఏకంగా 73,39,235 మంది ఓటర్ల పేర్లను తొలగించడానికి ఆటోమెటిక్‌గా ఫారం–7 దరఖాస్తులను ఆయా ఓటర్ల పేర్లతో జనరేట్ చేశారు.వాస్తవానికి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లపై అభ్యంతరాలు తెలిపే వ్యక్తి నిబంధనల ప్రకారం ఫారం–7 దరఖాస్తును ఈఆర్వోకు సమరి్పంచాలి. ఆ ఓటర్లను తొలగించాలని కోరాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫారం–7 నమూనాలో ‘టూ అడ్రస్’లో సంబంధిత నియోజకవర్గ ఈఆర్వో అని పేరు ఉంటుంది. కానీ ఈఆర్వోలు తమకు తామే ఆన్లైన్లో ఫారం–7 దరఖాస్తులు చేసుకుని ఇన్ని లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడానికి వారే నిర్ణయం తీసుకున్నారు. తొలగించే ముందు ఏం చేయాలి? ఓటర్ల తొలగింపు ప్రక్రియకు సంబంధించి ‘ఓటర్ల నమోదు నిబంధనలు–1960లో సెక్షన్ 21(ఏ)లో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు మరణించిన వ్యక్తులు, నియోజకవర్గంలో సాధారణ నివాసితులు కానివారు/కాకుండా పోయిన వారు, ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హత లేని వ్యక్తుల పేర్లు, ఇతర వివరాలతో ఈఆర్వోలు జాబితాను సిద్ధం చేయాలి. ‘ఫారం–10 నమూనా’లో ఆ జాబితాను ఈఆర్వోలు తమ కార్యాలయం నోటీసు బోర్డుపై కనీసం వారం రోజుల పాటు ప్రదర్శనకు ఉంచాలి.ఈ నోటీసుల్లోని పేర్ల తొలగింపుపై ఏ సమయం, ఏ స్థలంలో విచారణ నిర్వహిస్తారో తెలియజేయాలి. దీనిపై విస్తృత ప్రచారం చేసేందుకు ఇతర మార్గాల్లో సైతం ఈ నోటీసును ప్రచురించాలి. సీఈఓ కార్యాలయం వెబ్‌సైట్‌తో పాటు రాజకీయ పార్టీలకు సైతం ఈ జాబితాలను అందజేయాలి. నోటీసులోని ఓటర్ల పేర్లు తొలగింపుపై మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా దాఖలైన అభ్యంతరాలపై విచారణ జరిపిన తర్వాతే ఆ పేర్లలో అన్నింటినీ లేదా కొన్ని పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలా వద్దా అని నిర్ణయించాలి.ఎవరైనా వ్యక్తి పేరును పైన పేర్కొన్న కారణాలతో ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ముందు ఆ మేరకు ఎందుకు చర్యలు తీసుకోవద్దో కారణాన్ని తెలపాలంటూ సదరు వ్యక్తికి ఈఆర్వో.. షోకాజ్ నోటీసు జారీ అతడికి వివరణ ఇచ్చేందుకు సహేతుకమైన అవకాశం కల్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ రాష్ట్రంలోని 73,39,235 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ముందు ఈ నిబంధనలేవీ పాటించలేదు. ఏ ఒక్క ఈఆర్వో కార్యాలయం నోటీసు బోర్డుపై ఈ ఓటర్ల పేర్లతో జాబితాలను ఫారం–10 నమూనాలో ప్రదర్శించలేదు.తద్వారా తమ ఓటును తొలగించడంపై అభ్యంతరం తెలిపే అవకాశం ఈ ఓటర్లలో ఏ ఒక్కరికీ లభించలేదు. ఎందుకంటే వీరిలో ఒక్కరికీ ఈఆర్వోలు షోకాజ్ నోటీసులు సైతం జారీ చేయలేదు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలోనే అనర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈఆర్వోలకు ఈ సెక్షన్ ద్వారా అధికారాలు సంక్రమించగా, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలోనే ఓటర్లను తొలగించడం ద్వారా నిబంధనలను అతిక్రమించినట్టు స్పష్టమవుతోంది. మీ పేరు తొలగించాం..అభ్యంతరముంటే మళ్లీ దరఖాస్తు చేసుకోండి ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి సమరి్పంచని ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల(బీఎల్ఏ)లను సంప్రదించి బీఎల్ఓలు తయారు చేశారని, దీనిపై ఏమైనా అభ్యంతరం ఉంటే గడువులోగా ఫారం–6ను ఉపయోగించి నిర్దేశిత డిక్లరేషన్, పత్రాలతో సహా దరఖాస్తు చేసుకోవడం ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని సీఈఓ కార్యాలయం వెబ్సైట్లో తొలగించిన ఓటర్ల జాబితాతో పాటు ఓ ప్రకటన ఉంచడం గమనార్హం. ఏమిటీ ఫారం–7? ఓటర్ల నమోదు నిబంధనలు–1960లోని సెక్షన్ 13(ఏ) ప్రకారం ..ఓటర్ల జాబితాలోని పేర్ల తొలగింపునకు సంబంధించిన ప్రతి అభ్యంతరాన్ని ఫారం–7 రూపంలో దాఖలు చేయాలి. ఆపై సెక్షన్ 13(బీ) ప్రకారం.. ఏదైనా పోలింగ్ బూత్‌లోని ఓటరు/ఓటర్లను తొలగించడానికి ఫారం–7 దాఖలు చేసే దరఖాస్తుదారుడు అదే పోలింగ్ బూత్‌కి సంబంధిత ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలోనే లక్షల సంఖ్యలో ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7 దరఖాస్తులను ఈసీ గంపగుత్తగా ఆన్లైన్లో జనరేట్ చేయడం ద్వారా నిబంధనల పాటించినట్టుగా మమ అనిపించింది. హైలైట్ కోసం.. మొదటి పేరాలో.. – ఓట్ల తొలగింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వివరణ ఇచ్చుకోవడానికి సహేతుకమైన అవకాశం కల్పించాలని నిబంధనలు పేర్కొంటుండగా, ఈసీ ఈ ప్రక్రియ ఎక్కడా పాటించలేదు. 73,39,235 ఫారం–7 దరఖాస్తులు సృష్టి! పేరాలో.. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లుండగా, సర్,–2026 ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,87,213కు తగ్గిపోయింది. అంటే ముసాయిదా జాబితాలో 73,3,9235 మంది పేర్లు చేరలేదన్న మాట. ఇంటింటికీ తిరిగకుండానే పేరాలో.. బీఎల్ఓలు ఇంటింటికీ తిరగకపోవడంతో మిగిలిన ఓటర్లలో ఎక్కువ శాతం మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అసలు పంపిణీయే కాలేదు. దీంతో వారు వాటిని పూరించి తిరిగి దాఖలు చేయలేకపోయారు. దీంతో ఎన్యూమరేషన్ ఫారాలు సమరి్పంచిన 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో మాత్రమే ఆగస్టు 17న సర్–2026 ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించింది. తొలగించే ముందు ఏం చేయాలి? పేరాలో.. తుది ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలోనే అనర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈఆర్వోలకు ఈ సెక్షన్ ద్వారా అధికారాలు సంక్రమించగా, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలోనే ఓటర్లను తొలగించడం ద్వారా నిబంధనలను అతిక్రమించినట్టు స్పష్టమవుతోంది. -
'జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేయాలి'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలగించిన లక్షన్నర ఓట్ల వ్యవహారం, బీసీ జన గణన తేలేంతవరకు జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ఆరున్నర లక్షల ఓట్లను తొలగించారని.. ప్రస్తుతం డూప్లికేట్ ఓట్ల పేరుతో మరో 8 లక్షల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల తొలగింపు అంశంపై చర్చించడానికి గురువారం మరోసారి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు.


