వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి.. | hanumakonda district dharmasagar woman incident | Sakshi
Sakshi News home page

వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..

Jun 28 2025 7:44 AM | Updated on Jun 28 2025 11:33 AM

hanumakonda district dharmasagar woman incident

 వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో వివాహితను చితకబాదిన గ్రామస్తులు 
హనుమకొండ జిల్లాలో   ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అమానవీయ ఘటన  

వరంగల్‌ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. 

వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. 

ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.   

Advertisement
 
Advertisement
Advertisement