రాష్ట్రంలో గత దశాబ్ద కాలంలో అతి దగ్గరలోకి భూగర్భ జలాలు
పదేళ్లలో సగటున 1.7 మీటర్ల మేర వృద్ధి
గరిష్టంగా 7.93 మీటర్ల లోతులోనే లభ్యత
రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో పాతాళగంగ పైపైకి ఉబికి వచ్చింది. గత దశాబ్దకాలంతో పోలిస్తే సగటున 1.7 మీటర్ల మేర భూగర్భ జలాల్లో వృద్ధి నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సగ టున 4.42 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో కి వచ్చాయని.. కనిష్టంగా 2 మీటర్లు, గరిష్టంగా 7.93 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మే నుంచి అక్టోబర్‌కు 5.65 మీటర్ల వృద్ధి
మేలో వేసవి తీవ్రతతో భూగర్భ జలాల రాష్ట్ర సగటు 10.07 మీటర్లకు పడిపోగా వర్షాకాలం మొదలయ్యాక జూన్‌లో 9.47 మీటర్లకు, జూలైలో 8.37 మీటర్లకు, ఆగస్టులో 5.78 మీటర్లకు, సెప్టెంబర్‌లో 4.41 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షలకుపైగా బోరుబావుల కింద వానాకాలం పంటల సాగు కోసం భారీగా భూగర్భ జలాలను తోడేస్తున్నప్పటికీ అక్టోబర్‌లోనూ నిలకడగా 4.42 మీటర్ల లోతుకే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి.
మేతో పోలిస్తే అక్టోబర్ నాటికి భూగర్భ జలాలు 5.65 మీటర్ల మేరకు వృద్ధి చెందాయి. 2024 అక్టోబర్‌లో సగటున 5.38 మీటర్ల లోతులో లభ్యమైన భూగర్భ జలాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 4.42 మీటర్ల వరకు ఉబికి వచ్చాయి. గత నెలలోనూ సాధారణంకన్నా అధిక వర్షాలు కురవడమే దీనికి కారణం.
రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ అక్టోబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,778 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి తర్వాతి నెలలో నివేదికలను ఆ శాఖ విడుదల చేస్తోంది.
మహబూబాబాద్‌లో 2 మీటర్ల లోతుల్లోనే..
మహబూబాబాద్ జిల్లాలో 2 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభిస్తుండగా మెదక్ జిల్లాలో మాత్రం 7.84 మీటర్ల లోతులో అందుబాటులో ఉన్నాయి. జిల్లాల సగటు భూగర్భ జలమట్టాలను 0 నుంచి 5 మీటర్లు, 5 నుంచి 10 మీటర్లు, 10 మీటర్లకన్నా ఎక్కువ లోతు అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0 నుంచి 5 మీటర్ల లోతులోనే ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. మొత్తం 33 జిల్లాలకుగాను 19 జిల్లాల్లో 0 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నట్లు గుర్తించారు.
అలాగే 14 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల లోతులో, 2 జిల్లాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్లు తేలింది. 10 మీటర్లకన్నా ఎక్కువ లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. అంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భూగర్భ జలాలు సురక్షిత స్థాయిల్లోనే ఉన్నట్లు ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి.
సాధారణం కంటే 95% అధిక వర్షపాతం
ఏటా అక్టోబర్‌లో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 9.01 సెం.మీ. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం ఏకంగా 17.57 సెం.మీ. రికార్డు వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 95 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది.
28 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా 4 జిల్లాల్లో సాధారణం, ఒక్క మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోనే లోటు వర్షపాతం కురిసింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు రాష్ట్రంలో 83.1 సెం.మీ. సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా ఏకంగా 116.4 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 40 శాతం అధికం కావడం విశేషం.


