రెండేళ్లయినా రెండు జతలే.. పాత దుస్తులతోనే.. | Sakshi
Sakshi News home page

రెండేళ్లయినా రెండు జతలే.. పాత దుస్తులతోనే పాఠశాలకు

Published Sat, Dec 11 2021 3:12 PM

Government Stop School Uniform Due Corona Pandemic Karimnagar - Sakshi

సాక్షి,కరీంనగర్‌: సర్కారు పాఠశాలల్లో చదివేవిద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫాం దుస్తులు అందిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఉచితదుస్తుల పంపిణీకి మంగళం పాడడంతో పాత దుస్తులు వేసుకునే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇటీవల ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యపెరగడంతో దుస్తులు, పాఠ్యపుస్తకా లు, సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. రెండేళ్లుగా దుస్తుల పంపిణీ లేకపోవడంతో చాలా చోట్ల సాధారణ దుస్తులతోనే విద్యార్థులు బడికివెళ్తున్నారు.

కరోనా ఉధృతి తగ్గాక ఈ ఏడాది సెప్టెంబరు 1నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా.. ఇప్పటి వరకు ఏకరూ ప దుస్తులు అందలేదు.కుట్టించడానికి వస్త్రం కూడా జిల్లాకు రాలేదు. గతంలో ఇచ్చిన ఏకరూప దుస్తులు పెరిగిన పిల్లలకు పొట్టివై పనికి రావడం లేదు. జిల్లాలో 652 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 42,218 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఏటా రెండు జతల దుస్తులను ప్రభుత్వం అందిస్తోంది.

టెస్కో సంస్థ నుంచి దుస్తులకు అవసరమైన వస్త్రాన్ని సరఫరా చేసేది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు.. తప్ప దుస్తుల పంపిణీ జరుగలేదు. ‘రెండు జతల దుస్తుల పంపిణీపై జిల్లా నుంచి నివేదిక పంపించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిని విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. రాగానే అందరికి పంపిణీ చేస్తాం’ అని డీఈవో జనార్ధన్‌రావు తెలిపారు. 

చదవండి: ‘సచ్చినా సరే.. టీకా మాత్రం వేసుకోను’ 

Advertisement

తప్పక చదవండి

Advertisement