సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అవినీతి బట్టబయలైంది. స్వామి వారి ఆలయంలో ఉన్న బంగారు, వెండి డాలర్లు మాయమైన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వివరాల మేరకు.. ఇటీవల స్వా మివారి లడ్డూ ప్రసాదంలో చింతపండు చోరీ ఘటన మరువకముందే తాజాగా ప్రచార శాఖలో విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ.10-20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇవి ఏడాది క్రితమే మాయం కాగా ఇటీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు ధ్రువీకరించారు. ఆలయ రికార్డులను తాజాగా పరిశీలించిన ఆడిట్ అధికారులు.. ఆలయానికి చెందిన ప్రచార శాఖలో నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్‌లోని లెక్కలకు, భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక, యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమతో కూడిన బంగారు, వెండితో సిద్ధం చేసిన డాలర్లను దాదాపు 20 ఏళ్లుగా విక్రయిస్తున్నారు. ఈవో పర్యవేక్షణలో దేవస్థాన ఏఈవో ఆధీనంలో కొనసాగే ప్రచార శాఖలో భద్రపరిచి విక్రయాలు సాగిస్తున్నారు. స్వామి వారికి వివిధ రూపాల్లో వచ్చిన బంగారం, వెండిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్ కంపౌండ్‌కు ఆలయ ఈవో అందజేస్తారు.


