breaking news
silver dollars
-
యాదాద్రిలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?
సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అవినీతి బట్టబయలైంది. స్వామి వారి ఆలయంలో ఉన్న బంగారు, వెండి డాలర్లు మాయమైన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన బంగారం, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.వివరాల మేరకు.. ఇటీవల స్వా మివారి లడ్డూ ప్రసాదంలో చింతపండు చోరీ ఘటన మరువకముందే తాజాగా ప్రచార శాఖలో విక్రయించే బంగారు, వెండి డాలర్లు మాయమయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ.10-20 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఇవి ఏడాది క్రితమే మాయం కాగా ఇటీవల ఆడిట్ అధికారులు తనిఖీలు నిర్వహించి బంగారం, వెండి డాలర్లు మాయమైనట్టు ధ్రువీకరించారు. ఆలయ రికార్డులను తాజాగా పరిశీలించిన ఆడిట్ అధికారులు.. ఆలయానికి చెందిన ప్రచార శాఖలో నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. స్టాక్ రిజిస్టర్లోని లెక్కలకు, భౌతికంగా ఉన్న నాణేల సంఖ్యకు పొంతన లేకపోవడంతో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ప్రచార శాఖలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇక, యాదగిరిగుట్ట క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమతో కూడిన బంగారు, వెండితో సిద్ధం చేసిన డాలర్లను దాదాపు 20 ఏళ్లుగా విక్రయిస్తున్నారు. ఈవో పర్యవేక్షణలో దేవస్థాన ఏఈవో ఆధీనంలో కొనసాగే ప్రచార శాఖలో భద్రపరిచి విక్రయాలు సాగిస్తున్నారు. స్వామి వారికి వివిధ రూపాల్లో వచ్చిన బంగారం, వెండిని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మింట్ కంపౌండ్కు ఆలయ ఈవో అందజేస్తారు. -
డాలర్ల విక్రయంపై టీటీడీ నిర్లక్ష్యం
సాక్షి,తిరుమల: ‘‘డబ్బులిస్తాం. శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రం ఉండే బంగారు, వెండి డాలర్లు ఇవ్వండి’’ అని మొరపెట్టుకునే సామాన్య భక్తుల విజ్ఞప్తిని టీటీడీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ధర్మప్రచారం పేరుతో కోట్లాది రూపాయలను టీటీడీ మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. అయితే ధర్మప్రచారంతో ముడిపడిన వెంకన్న చిత్రాలతో ఉన్న బంగారు, వెండి డాలర్ల విక్రయాలను విస్మరిస్తోంది. రెండేళ్లుగా వెండి డాలర్లు నో స్టాక్ తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. శ్రీవారు, పద్మావతి అమ్మవారు చిత్రాలతో కూడిన వెండి, బంగారు డాలర్లను చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ధరిస్తుంటారు. ఇదో రకంగా ధర్మప్రచారానికి తోడ్పాటు అందిస్తోంది. 5 గ్రాములు, 10 గ్రాముల వెండి డాలర్లు విక్రయిస్తుంటారు. వీటి ధర రూ.100 నుంచి రూ.250లోపే ఉండడంతో తిరుమల క్షేత్ర సందర్శనకు గుర్తుగా సామాన్య భక్తులు కొనుగోలు చేస్తుంటారు. రెండేళ్లుగా వెండి డాలర్ల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీనిపై సామాన్య భక్తులు నిత్యం ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా దీనిగురించి ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలా లేదు. నిత్యం వేలాది మంది భక్తులు వెండి డాలర్ల కోసం రావడం, లేదనే సమాధానం చెబుతుండడంతోఆవేదనగా తిరుగుముఖం పడుతున్నారు. ఏడాదిగా రెండు గ్రాముల బంగారు డాలర్లు లేవు ఆలయ సమీపంలో బంగారు డాలర్లు విక్రయించే కౌంటర్లో సరిగ్గా ఏడాది కాలం నుంచి రెండు గ్రాముల బంగారు డాలర్ల్ల స్టాకు లేదు. ఆలయ విభాగం తన ఆధీనంలోనే ఉండే ఈ కౌంటర్లోని డాలర్ల స్టాకు సంగతి తెలియదని చెబుతోంది. అదే తరహాలోనే తిరుపతిలోని జ్యువెలరీ విభాగం కూడా అదే సమాధానం ఇస్తోంది. రెండు గ్రాముల డాలర్ల కొనుగోలు వ్యవహారాలను టీటీడీ మార్కెటింగ్ విభాగానికి అప్పగించి ఏడాది అవుతోంది. ఇప్పటికిప్పుడే కొనుగోలు చేయాలని చూసినా ఈ తంతు పూర్తయ్యేందుకు మరో ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది. 10గ్రాములు రూ.26,270లు, 5గ్రాములు రూ.13, 350లు, 2 గ్రాములు రూ.5,355ల ధరల్లో అతి తక్కువ ధరతో ఉండే బంగారు డాలర్లకే భక్తుల నుంచి రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉంది. అ యితే, అవసరమైన స్టాకు తెప్పించాలని అనేకమార్లు కౌంటర్ సిబ్బంది కోరినా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పరిస్థితి లేదు. కొత్త ఈవో సాంబశివరావు పట్టించుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.


