గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌లు పంపండి

Godavari Board Asked To Telugu States Send DPR Of Projects - Sakshi

త్వరగా అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించండి

ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ కార్యదర్శులకు గోదావరి బోర్డు లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ బేసిన్‌లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డీపీఆర్‌)లను తక్షణమే పంపాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో జరిగిన బోర్డు భేటీలు, అపెక్స్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన హామీల మేరకు వ్యవహరించాలని.. త్వరగా డీపీఆర్‌లను అందించేలా సంబంధిత అధికారులను ఆదేశించా లని కోరింది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వనరుల శాఖ కార్యదర్శులకు బోర్డు సభ్యుడు పీఎస్‌ కుటియాల్‌ శుక్రవారం లేఖ రాశారు. గత ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు భేటీ సందర్భంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్‌లు సమర్పి స్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారని, ఏపీ అధికారులు కూడా ఇంకా డీపీఆర్‌లు ఇవ్వని ప్రాజెక్టుల వివరాలు అందజేస్తామని పేర్కొన్నారని వివరించారు. జూన్‌ 10 నాటికల్లా డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు ఛైర్మన్‌ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబర్‌ 6న జరిగిన రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా కూడా.. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కేంద్ర జల శక్తి మంత్రి సూచించారని.. దానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకరించారని లేఖలో ప్రస్తావించారు.

ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దన్నా..
రెండో అపెక్స్‌ భేటీ తర్వాత డీపీఆర్‌లు సమర్పించాలని బోర్డు నవంబర్‌లో ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిందని, అనుమతులు లేని ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లరాదని ఆదేశించిందని పీఎస్‌ కుటియాల్‌ లేఖలో గుర్తు చేశారు. ఎన్నిసార్లు కోరినా తెలంగాణ డీపీఆర్‌లు ఇవ్వలేదన్నారు. ఏపీ పట్టిసీమ, పురుషోత్తమపట్నం డీపీఆర్‌లు ఇచ్చినా, పూర్తి వివరాలు లేవని.. వాటిని పొందుపరచాలని సూచించామని తెలిపారు. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిపెట్టాలని.. వెంటనే డీపీఆర్‌లు అందించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. కాగా డీపీఆర్‌లు ఇవ్వాలని బోర్డు కోరిన ప్రాజెక్టుల్లో.. గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్‌–3, సీతారామ, కంతనపల్లి, మిషన్‌ భగీరథ, లోయర్‌ పెన్‌గంగపై చేపట్టిన మూడు బ్యారేజీలు, రామప్ప–పాకాల నీటి తరలింపు, కాళేశ్వరంలోని మూడో టీఎంసీకి సంబంధించిన పనులు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top