
పిల్లలకు, పెద్దలకు అవగాహన కలిగించేందుకు అధికారుల కసరత్తు
కార్యక్రమం నిరంతర అమలుకు కార్యాచరణ
చిన్న అలవాటుతో సంపూర్ణ రక్షణ
కరకగూడెం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): పరిశుభ్రత అంటే కేవలం ఇల్లు, పరిసరాలే కాదు.. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే కీలకం. కనిపించని సూక్ష్మక్రిములు ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా సబ్బుతో కడుక్కోవడం ప్రధానంగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏటా అక్టోబర్ 15న ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, అవగాహన జీవితాలను ఎంత మెరుగుపరుస్తాయో చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం.
ఈ మేరకు పాఠశాలలు, వైద్యసంస్థల్లో అధికారులు చేతులు కడుక్కోవడం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. వాస్తవానికి ఈ దినోత్సవం బుధవారం ముగిసినా.. విద్యార్థులకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించడాన్ని యంత్రాంగం నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించింది. అందుకోసం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణపై అధికారులు దృష్టిపెట్టారు.
చేతుల పరిశుభ్రతే మొదటి టీకా..
ఆహారం తినే ముందు లేదా వండే ముందు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక, దగ్గు లేదా తుమ్ము తర్వాత, పిల్లల సంరక్షణ ముందు, రోగులు, చెత్త, జంతువులను తాకాక చేతులను తప్పనిసరి కడుక్కోవాలి. పైపైన కాక సబ్బు, శుభ్రమైన నీటితో కడిగి తుడుచుకోవడం ప్రధానం. నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడొచ్చు. తద్వారా మనం తాకే వస్తువుల్లో దాగి ఉండే లక్షలాది సూక్ష్మక్రిములు చేతుల ద్వారా ఆహారంలోకి, ఆపై శరీరానికి చేరి వ్యాధులకు కారణం కాకుండా అడ్డుకోవచ్చు.
గ్రామీణులకు అవగాహన లోపం..
నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై అవగాహన లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా టాయిలెట్ వెళ్లి వచ్చాక లేదా పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు సబ్బు వాడకపోవడం, మొక్కుబడిగా చేతులు కడుక్కోవడంతో అతిసార, వాంతులు వంటివి వ్యాపిస్తున్నాయి. గొత్తికోయ ప్రాంతాల్లో హ్యాండ్‌వాష్ కు బదులు ఇప్పగింజల పొడి, కానుగ పొడి వాడుతున్నా అవగాహన మరింత పెరగాల్సి ఉంది.
చేతులు కడుక్కోకపోతే అనర్థాలు
చేతులు కడుక్కోకపోవడం వల్ల కలిగే అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. టాయిలెట్‌కు వెళ్లివచ్చాక చేతులు కడుక్కోకపోతే మలంలోని సూక్ష్మక్రిములు చేతులకు అంటుకోవడం, అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తినడం ద్వారా అవి శరీరంలోకి ప్రవేశించి డయేరియాకు కారణమవుతాయి.
ఇది చిన్న పిల్లలలో తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీసి మరణానికి కారణం కావచ్చు. అపరిశుభ్రమైన చేతులతో ఆహారాన్ని తాకినా, తయారుచేసినా వాంతులు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి తోడు టైఫాయిడ్, కలరా కూడా కలిగే ప్రమాదమూ ఉంది. అలాగే, ముఖం, కళ్లు, ముక్కును చేతులతో తాకినప్పుడు క్రిములు శ్వాసకోశంలోకి చేరి ఇన్‌ఫుయెంజా, జలుబు వ్యాపిస్తాయి. అలాగే, కళ్లను రుద్దుకున్నప్పుడు కండ్ల కలక వచ్చే ప్రమాదం ఉంది.

చేతుల శుభ్రతతో ఆరోగ్యం సొంతం
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అంతా గుర్తించాలి. తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఈ చిన్న అలవాటు కుటుంబ ఆరోగ్య రక్షణలో కీలకంగా నిలుస్తుంది. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ‘హ్యాండ్ వాషింగ్ హీరో’గా మారితే వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుంది. – డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా