కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు 

GHMC Elections: Flames Of Discontent In Congress - Sakshi

సమర్థులను ఎంపిక చేసి బీఫామ్‌ అందివ్వాలని అధిష్టానం యోచిస్తోంది. అభ్యర్థుల ఖారారు అన్ని సామజిక సమీకరణలు పరిగణలోకి తీసుకున్నా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే వారిని సైతం పక్కకు పెట్టి కనీసం బలం లేని వారికి సీటు ఖారారు చేయడం పార్టీ శ్రేణులకు మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో కొన్ని స్థానాల నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన వారు కొందరు రోడెక్కి నిరసన వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు అగ్రనేతలపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్‌లో పలు అభ్యర్థిత్వాల ఖరారుపై అసంతృపి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనడంతో వాటి అభ్యర్థిత్వాల ఖరారుపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఐదు విడుతలుగా దాదాపు 116 డివిజన్లకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసి జాబితా ప్రకటించింది. నామినేషన్‌ దాఖలు గడువు ముగిసినా మిగిలిన 34 స్థానాలకు అభ్యర్థిత్వ ఖరారును పెండింగ్‌లో పడేసింది. అయితే ఆ స్థానాలకు పోటీపడుతున్న ఆశవహులు మాత్రం నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్టీ అధిష్టానవర్గంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాంగోపాల్‌పేట్‌ డివిజన్‌ నుంచి టికెట్‌ను ఆశించిన మనోజ్‌ ఏకంగా ఆందోళనకు దిగి మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. చివరి క్షణం వరకు టికెట్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ మనోజ్‌ వర్గం ఆందోళనకు దిగింది. పార్టీ తిరగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మరికొన్ని డివిజన్ల విషయంలో సైతం పోటీ నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. చదవండి: ముగిసిన జీహెచ్‌ఎంసీ నామినేషన్ల ప్రక్రియ

శివార్లపై ఆశలు 
కాంగ్రెస్‌ పార్టీకి శివారు డివిజన్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొత్తం డివిజన్లలో 30 శాతంపైగా డివిజన్లు శివార్లలోనే ఉన్నాయి. అత్యధికగా శివారు డివిజన్లు మేడ్చల్‌–మల్కాజిగిరి పరిధిలో ఉండటంతో పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డికి సవాల్‌గా మారాయి. మరోవైపు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికి తమ పరిధిలోని డివిజన్లు ప్రతిష్టాత్మకంగా మారాయి.  

22న మేనిఫెస్టో విడుదల 
కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదలను 22కు వాయిదా వేసింది. వాస్తవంగా ఈ నెల 21న విడుదల చేయాలని భావించినప్పటికీ ఒక రోజు ముందుకు పొడిగించింది. మరోవైపు అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం కోసం పది మందితో స్టార్‌ క్యాంపెయిన్‌ జాబితాను ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ వారిగా సమన్వయకర్తలను నియమించి బాధ్యతలు అప్పగించింది.  

ఉనికి కోసం టీజేఎస్‌
సాక్షి, మేడ్చల్‌ జిల్లా: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) ఉనికి చాటుకునేందుకు 31 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. గ్రేటర్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టీజేఎస్‌ తహతహలాడుతోంది. ప్రధాన పార్టీల కంటే ముందుగానే తెలంగాణ జన సమితి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. గురువారం 27 డివిజన్ల అభ్యర్థులను ప్రకటించగా, శుక్రవారం సీతాఫల్‌మండి, హాబ్సిగూడ, కవాడీగూడ, బంజారాహిల్స్‌ డివిజన్ల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. వీరందరికి పార్టీ నాయకత్వం బీ ఫారాలు అందజేసింది.  

పట్టుకోసం కమ్యూనిస్టుల పాకులాట  
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మహానగరంలో ప్రజాపోరాటాల్లో తమ పట్టు కోసం గ్రేటర్‌ ఎన్నికల్లో 26 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. సీపీఐ 14 డివిజన్ల నుంచి బరిలో నిలవగా, సీపీఎం 12 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీలో పెట్టింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top