‘మైసూర్‌ మల్లిక’తో ఆదాయం అదుర్స్‌.. కేజీ ధర ఎంతంటే?

Full Demand For Mysore Mallika Variety Of Rice In Market - Sakshi

ఎకరం విస్తీర్ణంలో దేశవాళీ వరి వంగడం సాగుచేసిన రెడ్లకుంట రైతు

ఎకరానికి 19 క్వింటాళ్ల దిగుబడి 

కేజీ బియ్యం రూ.80 చొప్పున విక్రయం

కోదాడ రూరల్‌: మైసూర్‌ మల్లిక అనే దేశవాళీ వరి వంగడం సాగుచేస్తూ కళ్లు చెదిరే ఆదాయం ఆర్జిస్తున్నాడు కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంటకు చెందిన రైతు చండ్ర వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నుంచి మైసూర్‌ మల్లిక దేశవాళీ వరి విత్తనాలను తెప్పించి ఎకరం విస్తీర్ణంలో పంట సాగుచేసేందుకు నారు పెంచాడు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనాలు సాధారణ వరి సాగు పద్ధతిలోనే నాటు వేశాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ ఎలాంటి పురుగు మందులు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకు అందించాడు.

తెగుళ్ల బెడద లేదు..
దేశవాళీ వరి వంగడం కావడం, సేంద్రియ సాగుకు నేల అనుకూలంగా ఉండడంతో పంటకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని రైతు చండ్ర వెంకటేశ్వర్‌రావు తెలిపాడు. అదేవిధంగా ఈ రకం వరికి వ్యాధినిరోధక శక్తి కూడా ఎక్కువ అని, గాలి దుమ్ముకు కూడా పంట నేలవాలలేదని పేర్కొన్నాడు. పైరు మూడున్నర అడుగుల ఎత్తు వరకు పెరిగిందని, ప్రస్తుతం వరి కోత పూర్తయ్యిందని, ఎకరంలో 19క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపాడు.

ఎకరానికి రూ.లక్ష పైచిలుకు ఆదాయం  
మైసూర్‌ మల్లిక రకం బియ్యానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, ఎకరానికి 19 క్వింటాళ్లు వచ్చిందని, మిల్లు పట్టిస్తే క్వింటాల్‌కు 65 కేజీల చొప్పున మొత్తంగా 11క్వింటాళ్ల పైనే బియ్యం వచ్చిందని రైతు చండ్ర వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నాడు. ఈ బియ్యాన్ని కేజీ రూ.80 చొప్పున కోదాడలోని తన సేంద్రియ ఉత్పత్తుల షాపులోనే అమ్ముతున్నట్లు తెలిపాడు. ఎకరానికి వచ్చే 19క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్‌ రూ.8వేల చొప్పున అమ్మినా రూ.1,52,000 ఆదాయం వస్తుందని, పెట్టుబడి ఖర్చు రూ.30వేలు పోగా రూ.1.22లక్షల నికర ఆదా యం తప్పకుండా ఉంటుందని రైతు వివరించాడు.

రసాయన ఎరువులు వాడలేదు
గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. మైసూర్‌ మల్లిక దేశవాళీ వరి వంగడం సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. ఎకరానికి 11 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వచ్చింది. ఆ బియ్యాన్ని కోదాడ పట్టణంలోని నా సేంద్రియ ఉత్పత్తుల షాపులో కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నాను. చా లా మంది ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
–చండ్ర వెంకటేశ్వరరావు, సేంద్రియ రైతు, రెడ్లకుంట 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top