breaking news
special rice irrigation
-
‘మైసూర్ మల్లిక’తో ఆదాయం అదుర్స్..
కోదాడ రూరల్: మైసూర్ మల్లిక అనే దేశవాళీ వరి వంగడం సాగుచేస్తూ కళ్లు చెదిరే ఆదాయం ఆర్జిస్తున్నాడు కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంటకు చెందిన రైతు చండ్ర వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి మైసూర్ మల్లిక దేశవాళీ వరి విత్తనాలను తెప్పించి ఎకరం విస్తీర్ణంలో పంట సాగుచేసేందుకు నారు పెంచాడు. ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనాలు సాధారణ వరి సాగు పద్ధతిలోనే నాటు వేశాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ ఎలాంటి పురుగు మందులు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకు అందించాడు. తెగుళ్ల బెడద లేదు.. దేశవాళీ వరి వంగడం కావడం, సేంద్రియ సాగుకు నేల అనుకూలంగా ఉండడంతో పంటకు ఎలాంటి తెగుళ్లు సోకలేదని రైతు చండ్ర వెంకటేశ్వర్రావు తెలిపాడు. అదేవిధంగా ఈ రకం వరికి వ్యాధినిరోధక శక్తి కూడా ఎక్కువ అని, గాలి దుమ్ముకు కూడా పంట నేలవాలలేదని పేర్కొన్నాడు. పైరు మూడున్నర అడుగుల ఎత్తు వరకు పెరిగిందని, ప్రస్తుతం వరి కోత పూర్తయ్యిందని, ఎకరంలో 19క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపాడు. ఎకరానికి రూ.లక్ష పైచిలుకు ఆదాయం మైసూర్ మల్లిక రకం బియ్యానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఎకరానికి 19 క్వింటాళ్లు వచ్చిందని, మిల్లు పట్టిస్తే క్వింటాల్‌కు 65 కేజీల చొప్పున మొత్తంగా 11క్వింటాళ్ల పైనే బియ్యం వచ్చిందని రైతు చండ్ర వెంకటేశ్వర్రావు పేర్కొన్నాడు. ఈ బియ్యాన్ని కేజీ రూ.80 చొప్పున కోదాడలోని తన సేంద్రియ ఉత్పత్తుల షాపులోనే అమ్ముతున్నట్లు తెలిపాడు. ఎకరానికి వచ్చే 19క్వింటాళ్ల వరి ధాన్యాన్ని క్వింటాల్ రూ.8వేల చొప్పున అమ్మినా రూ.1,52,000 ఆదాయం వస్తుందని, పెట్టుబడి ఖర్చు రూ.30వేలు పోగా రూ.1.22లక్షల నికర ఆదా యం తప్పకుండా ఉంటుందని రైతు వివరించాడు. రసాయన ఎరువులు వాడలేదు గత ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. మైసూర్ మల్లిక దేశవాళీ వరి వంగడం సాగుకు ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. ఎకరానికి 11 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వచ్చింది. ఆ బియ్యాన్ని కోదాడ పట్టణంలోని నా సేంద్రియ ఉత్పత్తుల షాపులో కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నాను. చా లా మంది ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. –చండ్ర వెంకటేశ్వరరావు, సేంద్రియ రైతు, రెడ్లకుంట -
రాములోరి తలంబ్రాలకు... వరిసాగు
తూర్పుగోదావరి(రాజానగరం):భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం నాలుగేళ్లుగా ఏటా గోటితో వలిచిన కోటి తలంబ్రాలను సమర్పిస్తున్న విషయం తెలిసిందే. కాగా వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఒంటిమిట్ట రాములవారికి సమర్పించే తలంబ్రాల నిమిత్తం సంఘం ఆధ్వర్యంలో రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో వరిసాగుకు సోమవారం శ్రీకారం చుట్టారు. నాతిపాము శ్రీరామ్మూర్తికి చెందిన పొలంలో జై శ్రీరామ్’అని జపిస్తూ, ఏసీబీ డీఎస్పీ జి.మురళీకృష్ణ చేతుల మీదుగా వరి విత్తనాలు చల్లించారు. తొలుత శాస్త్రోక్తంగా ధాన్యలక్ష్మి అనుష్టానంతో విత్తనశుద్ధి చేశారు. ‘శ్రీరామ నామం అనే విత్తనం మనస్సులో నాటుకుంటే జ్ఞానం అనే పంట పండుతుంది’ అని సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు అన్నారు. అదే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాములోరి కల్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందించనున్నట్టు చెప్పారు.