
హైదరాబాద్: నెల్లూరు ఎంపీ కుమారుడిని అంటూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్న కరుడు గట్టిన మోసగాడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో 14 చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు (29) బీటెక్ వరకు చదువుకున్నాడు.
చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో పాటు జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడటం మొదలు పెట్టాడు. తనకు తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొడుకుగా చెప్పుకుంటూ వీఐపీగా చెలామణి అవుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ డా.విక్రాంత్ రెడ్డి అనే నకిలీ పేరుతో కాలం గడుపుతున్నాడు. ఇదే క్రమంలో కేపీహెచ్‌బీ కాలనీలోని సితార ఉమెన్స్ పీజీ హాస్టల్‌లో తన బంధువులు, జూనియర్లను చేర్పించే నెపంతో నిర్వాహకురాలితో పరిచయం పెంచుకున్నాడు. నాలుగుసార్లు హాస్టల్‌ను సందర్శించి..బొజనం చేసి తాను జూబ్లీహిల్స్‌లో జ్యువెలరీ షాపు కూడా నడుపుతున్నానని నమ్మించాడు. హాస్టల్ నిర్వాహకురాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును రీ మోడలింగ్ చేస్తానని తీసుకున్నాడు.
రీమోడలింగ్ కోసం మరింత బంగారం అవసరమని చెప్పి, ఆమె వద్ద నుంచి ఆన్‌లైన్‌లో 55 వేలు, నగదు రూపంలో 45 వేల రూపాయలు తీసుకున్నాడు. మొత్తం లక్ష నగదుతో పాటు, 4 తులాల బంగారు గొలుసు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో బాధితురాలు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నకిలీ డాక్టర్ గుట్టు రట్టు చేశారు. జేఎన్‌టీయూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో వెళుతున్న వెంకటేశ్వర్లును సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తరలించి విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.
ఇతనిపై జూబ్లీహిల్స్, గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో కూడా చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఇతనిపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో 11 కేసులు నమోదయ్యాయి. వీఐపీగా నమ్మించేందుకు పెద్దపెద్ద కార్లు, చుట్టూ బౌన్సర్లను కూడా పెట్టుకుని తిరగడం ఇతని ప్రత్యేకత అని పోలీసులు తెలిపారు. కాగా మోసగాడిని అరెస్టు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులను బాలానగర్ డీసీపీ కె.సురేష్ కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ ఇ.రవి కిరణ్‌రెడ్డి అభినందించారు.