ఆ నలుగురిదీ హత్యే | Four family members found dead at Nalgonda home case Updates | Sakshi
Sakshi News home page

ఆ నలుగురిదీ హత్యే

Jun 25 2026 2:22 AM | Updated on Jun 25 2026 2:22 AM

Four family members found dead at Nalgonda home case Updates

పోస్టుమార్టం నివేదికలో వెలుగులోకి

మృతదేహాలపై కత్తిపోట్ల గుర్తింపు

ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ చంపి ఉండొచ్చని పోలీసుల అనుమానం

నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్‌ సుల్తాన్‌ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్‌(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురూ హత్యలకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ, ఛాతీ భాగంలో గాయాలు ఉండటంతో ఇది కచ్చితంగా ప్రొఫెషనల్‌ కిల్లర్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే నిందితులకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు లభించలేదు.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సుల్తాన్‌ మృతదేహంపై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా కరాటే వచ్చిన ముజమిల్‌ ప్రతిఘటించడంతో 16 చోట్ల విచక్షణారహితంగా పొడిచి ఉండొవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులకు భయపడి 11 ఏళ్ల అక్సర మంచం కింద దాక్కుంటే ఆమెను బయటకు లాగి చంపి ఉంటారని.. ఆమె మృతదేహం సగం మంచం కింద ఉండటాన్నిబట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే హత్యల అనంతరం నిందితులు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లిపోవడంతో దుండగులు పక్కా ప్రణాళికతోనే వ్యవహరించినట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో 20 మంది!
ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మృతుల మొబైల్‌ కాల్‌డేటా ఆధారంగా 20 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆస్తి గొడవలు, బంధువులతో విభేదాల కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల కిందట మృతుల ఇంట్లో దొంగతనం జరగడం.. తాజాగా హత్యల అనంతరం ఇంట్లోని బీరువాలు, వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో ఈ రెండు ఘటనలకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇల్లు పట్టణానికి చివరన ఉండటంతోపాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. అయితే ఘటన జరిగిన రాత్రి ఇంట్లో కేకలు వినిపించినట్లు కొందరు స్థానికులు చెబుతున్నారు. ఆ కుటుంబంలో అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుండటంతో ఆ రోజు కూడా అదే జరుగుతోందని భావించి దృష్టిపెట్టలేదంటున్నారు. మూడు రోజుల తర్వాత ఇంట్లో దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement