
ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పులు లేవు
గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్‌కు వివరించిన న్యాయవాదులు
ఫార్ములా–ఈ కేసు విచారణ తీరుపై న్యాయవాదులతో చర్చించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కేసు విచారణ సందర్భంగా మొబైల్ ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్ ఇవ్వాల ని ఏసీబీ కోరడంపై తన న్యాయవాదులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు. మంగళవారం తన న్యాయవాదులతో విచారణ తీరు తెన్నులపై చర్చించారు. ‘ఏసీబీ విచారణ ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికార యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్ వ్యక్తి గతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారు.
ఫార్ములా–ఈ కేసు ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదు’ అని కేటీఆర్ న్యాయవాదులు స్పష్టం చేశారు. ‘ఈ అంశానికి సంబంధించి ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటు లో ఉన్నాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదు. సమాచారం అంతా ప్రభుత్వానికి అందు బాటులో ఉన్నా కేవలం రాజకీయ వేధింపుల కోణంలో కేటీఆర్ మొబైల్ ఫోన్‌ను అడగడం వెనుక న్యాయ సమ్మతమైన కారణాలు లేవు’ అని న్యాయ వాదులు కేటీఆర్‌కు చెప్పినట్లు సమాచారం.
‘విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో కోర్టులు పలు తీర్పులు ఇచ్చాయి. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను కోర్టు తీర్పు లేకుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఐటీ చట్టం ప్రకారం ఏసీబీ తీరు వ్యక్తిగత హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఈ చట్ట ప్రకారం కేవలం కోర్టు తీర్పుతోనే విచారణ సంస్థలు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి వ్యక్తిగత ఉపకరణాలు అడగవచ్చు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవన్నారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోంది’ అని కేటీఆర్‌కు న్యాయవాదులు వివరించారు.