డాక్టర్స్‌ డే: పంచ ప్రాణాలు తిరిగిచ్చారు! | The first multivisceral transplant in the country | Sakshi
Sakshi News home page

డాక్టర్స్‌ డే: పంచ ప్రాణాలు తిరిగిచ్చారు!

Jul 2 2026 4:45 AM | Updated on Jul 2 2026 4:45 AM

The first multivisceral transplant in the country

రోగికి 5 అవయవాల మార్పిడి 

దేశంలోనే తొలిసారి మల్టీవిసరల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ 

36 గంటలపాటు శస్త్రచికిత్స..ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల ఘనత 

బ్రెయిన్‌ డెడ్‌ మహిళ నుంచిజీర్ణాశయం, ఆంత్రమూలం, క్లోమగ్రంథి, చిన్నపేగు, పెద్దపేగు సేకరణ 

సాక్షి, హైదరాబాద్‌/అఫ్జల్‌గంజ్‌: రాష్ట్రంలోని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు సరికొత్త చరిత్ర లిఖించారు. ఒక రోగికి ఏకకాలంలో ఐదు అవయవాలను (మల్టీ విసరల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌) విజయవంతంగా మార్పిడి చేశారు. దేశ వైద్య రంగంలో ఇదో మైలురాయి అని.. ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడం దేశంలోనే తొలిసారి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగం అధిపతి డాక్టర్‌ మధుసూదన్‌ వివరించారు. 

జన్యు సమస్యతో పేగులు తొలగించడం వల్ల.. 
సిరిసిల్లకు చెందిన ఓ 30 ఏళ్ల ఇంజనీర్‌ జన్యుపరమైన సమస్యతో బాధపడుతూ గతంలో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు పెద్ద పేగును పూర్తిగా, చిన్నపేగును కొంతమేర తొలగించారు. దీంతో రోగి ఆహారం తీసుకోవడం తగ్గిపోయి బరువు కోల్పోయాడు. ఇందుకు ఇంటస్టైనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఒక్కటే పరిష్కారమని తెలుసుకొని ఉస్మానియా ఆసుపత్రికి వచ్చాడు. రోగికి ఎండోస్కోపీ నిర్వహించిన వైద్య బృందం.. అతని పేగు భాగాల్లో, అక్కడి రక్తనాళాల్లో చాలా చోట్ల ట్యూమర్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం మల్టీవిసరల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడమే పరిష్కారమని పేర్కొంది. 

అయితే ఇలాంటి చికిత్స దేశంలో ఇప్పటివరకు ఎవరికీ చేసిన అనుభవం లేకపోవడంతో చాలా ఆసుపత్రుల వైద్యులను ఉస్మానియా వైద్య బృందం సంప్రదించింది. చివరకు అనిల్‌ వైద్య అనే వైద్యుడికి కేసు వివరాలు పంపగా ఆయన సలహా మేరకు మల్టీవిసరల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రక్రియకు సిద్ధపడింది. అయితే ఇందుకు సరైన అవయవ దాత దొరకాల్సి ఉండటంతో 8 నెలల క్రితం జీవన్‌దాన్‌ ట్రస్ట్‌లో రిజిస్టర్‌ చేసింది. 

ఇటీవల ఓ 35 ఏళ్ల మహిళ బ్రెయిన్‌ డెడ్‌కు గురై ఉస్మానియాలో అడ్మిట్‌ కావడంతో వైద్య బృందం ఆమె బందువులను అవయవదానం కోసం సంప్రదించగా వారు ఒప్పుకున్నారు. వెంటనే వైద్య బృందం శస్త్రచికిత్స ప్రారంభించింది. బ్రెయిన్‌ డెడ్‌కు గురైన మహిళ నుంచి జీర్ణాశయం (కడుపు), డియోడినమ్‌ (ఆంత్రమూలం), పేంక్రియాస్‌ (క్లోమగ్రంథి), చిన్నపేగు (స్మాల్‌ ఇంటెస్టైన్‌), పెద్ద పేగు (లార్జ్‌ ఇంటెస్టైన్‌)ను ఏకకాలంలో సేకరించి వాటిని రోగికి శస్త్రచికిత్స ద్వారా అమర్చింది. 

సీఎం రేవంత్, మంత్రి దామోదర అభినందనలు 
అరుదైన శస్త్రచికిత్స విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన వైద్యులు, నర్సింగ్, ఇతర సహా య సిబ్బందిని సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక, అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement