పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు  | Sakshi
Sakshi News home page

పక్కా నిఘా..పటిష్ట బందోబస్తు 

Published Thu, Feb 29 2024 1:23 AM

The first day of the inter examination was peaceful - Sakshi

తొలి రోజు ఇంటర్‌ పరీక్ష ప్రశాంతం 

ద్వితీయ భాష పేపర్‌–1 రాసిన 4,88,113 మంది 

మూడుచోట్ల మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మిడియెట్‌ మొదటి సంవత్సరం పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 5,07,754 మంది విద్యార్థు లు పరీక్ష కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 4,88,113 మంది హాజరయ్యారు. 19,641 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు.

మూడుచోట్ల మాల్‌ ప్రాక్టీసింగ్‌ జరిగినట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. కరీంనగర్, నిజామాబాద్, జనగాం జిల్లాల్లో ఈ మేరకు కేసులు నమోదైనట్టు తెలిపింది. తొలి రోజు ద్వితీయ భాష పేపర్‌–1 పరీక్ష నిర్వహించారు. మూడు సెట్ల ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపి అందులో ‘ఎ’సెట్‌ను ఎంపిక చేశారు. 

ప్రైవేటుపై ప్రత్యేక నిఘా 
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 1,521 పరీ­క్షా కేంద్రాల్లో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశా రు. 880 ప్రైవేటు కాలేజీల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. కార్పొరేట్‌ కాలేజీల జోక్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రతి పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ విధించారు. పేపర్‌ లీకేజీలకు ఆస్కారం లేకుండా, అసాంఘిక శక్తుల ప్రవేశా­న్ని నిరోధించేందుకు ఈసారి పోలీసు బందోబస్తు పెంచారు. 75 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు సుడిగాలి తనిఖీలు చేపట్టాయి. 200 సిట్టింగ్‌ స్వా్కడ్స్‌ సమస్యాత్మక కేంద్రాల్లో సజావుగా పరీక్షలు జరిగేందుకు తోడ్పడ్డాయి. 

టెన్షన్‌... టెన్షన్‌... 
తొలి రోజు పరీక్ష కావడంతో పలు ప్రాంతాల్లో విద్యార్థుల్లో టెన్షన్‌ వాతావరణం కన్పించింది. హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షకు గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవడం కన్పించింది.

పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేసినప్పటికీ మారుమూల ప్రాంతాల్లో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల్లో స్వల్పంగా సడలింపు ఇచ్చినట్టు జిల్లాల అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, అవి సకాలంలో అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు విన్పించాయి. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు సొంత రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement