
చాట్లపల్లిలో పురుగుల మందు డబ్బాతో నిరసన
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ పేద కుటుంబం పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. ఈ ఘటన మండలంలోని చాట్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. బుధవారం గ్రామ కార్యదర్శి సాయిబాబాతోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసేందుకు వెళ్లారు. గ్రామానికి చెందిన స్వప్న రమేష్ దంపతులు తమది పేద కుటుంబమని, అన్ని అర్హతలు ఉన్నా.. మొదటి విడతలో ఇల్లు రాలేదని తెలిపారు.
తమ పేరు ఎందుకు రాయలేదని అక్కడికి వచ్చిన అధికారులు, కమిటీ సభ్యులను నిలదీశారు. ఇల్లు మంజూరు చేయకుంటే ఇక్కడే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో దంపతులిద్దరూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దంపతులను సముదాయించారు. అనంతరం ఎంపీడీఓ రాంరెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు.