ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫేక్‌ ఫ్యాకల్టీ | Fake faculty in engineering colleges: Telangana | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫేక్‌ ఫ్యాకల్టీ

Jun 27 2025 5:01 AM | Updated on Jun 27 2025 5:01 AM

Fake faculty in engineering colleges: Telangana

తనిఖీలు చేశాకే అనుబంధ గుర్తింపు.. తేల్చిచెప్పిన అధికారులు

జూలై రెండో వారంలోనే గుర్తింపు జాబితా

ఈ ఏడాదికి పాత ఫీజులతోనే కౌన్సెలింగ్‌ చేపట్టాలన్న ప్రభుత్వం 

దీనిపై కాలేజీలు కోర్టుకెళ్తే వినిపించాల్సిన వాదనపై న్యాయ సలహా కోరిన విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదు రవుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకటిస్తున్నప్పటికీ కౌన్సెలింగ్‌ ఏ మేరకు ముందుకెళ్తుందనేది అనుమానంగానే ఉంది. తాజాగా ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నకిలీ అధ్యాపకులు ఉన్నారని జేఎన్‌టీయూహెచ్‌ అధికారులే అను మానం వ్యక్తం చేశారు. పీజీఈసెట్‌ ఫలితాల ప్రకటన సందర్భంగా వర్సిటీ రెక్టార్‌ డాక్టర్‌ విజయకుమార్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘అధ్యాపకుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను కొంత మంది అప్‌లోడ్‌ చేయలేదు. కొన్ని అస్పష్టంగా ఉన్నాయి.

అవి నకిలీవో లేక అస లువో పరిశీలించాలి’ అని ఆయన అన్నారు. ఆ తర్వాతే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తా మని చెప్పారు. ఇంజనీరింగ్‌ కాలేజీల యాజ మాన్యాలు అర్హులైన అధ్యాపకుల సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసి బోధన మాత్రం అనర్హులతో చేయిస్తున్నాయనే ఫిర్యాదులు ఏటా వస్తున్నా యి. వాటిని పరిశీలించడంపై జేఎన్‌టీయూ హెచ్‌ ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడు? కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేదెప్పుడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జూలై తర్వాతే గుర్తింపు జాబితా
అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) కొత్త బ్రాంచీలు, అదనపు సీట్లపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొన్ని సీట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చే వీలుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరం ఒక్క సీటు కూడా పెంచేందుకు అనుమతించొద్దని అధికారులను ఆదేశించింది. ఈ నెల 30 వరకు కొత్త సీట్ల కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ఏఐసీటీఈ కల్పించగా ఆ తేదీ తర్వాతే అనుబంధ గుర్తింపు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు.

దీంతోపాటు కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలికవసతుల లోపం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 80 కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చారు. కాలేజీల నుంచి వచ్చిన సమాధానాలను జూలై మొదటి వారంలో పరిశీలించి ఆ తర్వాతే గుర్తింపు ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇచ్చినా ఆప్షన్లు పెట్టుకొనే గడువు మాత్రం జూలై రెండో వారం తర్వాతే ఉండే వీలుంది.

ప్రైవేటుకు ముకుతాడు వేయడం ఎలా?
ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఏఎఫ్‌ఆర్‌సీ) ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపింది. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది ఫీజులు పెంచకూడదని స్పష్టం చేసింది. పాత ఫీజులతోనే కౌన్సెలింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అయితే దీనిపై ప్రైవేటు కాలేజీలు కోర్టుకెళ్లే యోచనలో ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇటీవల అధికారులతో చర్చించారు.

దీన్ని ఎదుర్కోవడంపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని అధికారులకు చెప్పారు. గతంలో వేసిన టాస్క్‌ఫోర్స్‌ నివేదికలోని అంశాలు ఏ మేరకు కోర్టులో వినిపించవచ్చో ఆలోచించాలన్నారు. అయితే ఈ పరిణామాలపై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కూడా అంతే పట్టుదలగా ఉన్నాయి. ఏఎఫ్‌ఆర్‌సీ అధికారాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడాన్ని కోర్టులో సవాల్‌ చేయాలనుకుంటున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement