నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నీరా కేఫ్‌

Excise Minister Srinivas Goud Inspects Neera Cafe Works At Necklace Road - Sakshi

తెలంగాణ ఆవిర్భావోత్సవానికి ముందే ప్రారంభిస్తాం 

ఔషధ గుణాలున్న నీరా, కల్లు ఉత్పత్తికి చర్యలు 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ 

ఖైరతాబాద్‌ (హైదరాబాద్‌): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్‌ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడుతున్న కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్‌ పనులను శ్రీనివాస్‌ గౌడ్‌ పరిశీలించారు.

తెలంగాణ ఆవిర్భావ దినం కంటే ముందే నీరా కేఫ్‌ను ప్రారంభించడంతోపాటు పూర్వీకుల చరిత్రను ఉట్టిపడేలా తీర్చిదిద్దుతామన్నారు. బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర తయారుచేసి ప్రత్యేక ప్యాకింగ్‌తో అందజేస్తామని తెలిపారు. ఆయుర్వేదిక్‌ డాక్టర్ల పర్యవేక్షణతోపాటు సీసీఎంబీ, సీఎస్‌ఐఆర్, ఐఐసీటీ వంటి సంస్థల సహకారంతో శాస్త్రీయంగా పరీక్షించి వీటి లాభాలను ప్రజలకు వివరిస్తామన్నారు.

నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఔషధ గుణాలున్న నీరా, కల్లు ఉత్పత్తికోసం ఇప్పటికే 4.25కోట్ల చెట్లను పెంచామని, రాబోయే రోజుల్లో 5 కోట్ల చెట్లు పెంచి స్వచ్ఛమైన కల్లును సీసాల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు కె.కిషోర్‌ గౌడ్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top