
కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో పాత్రపై ప్రశ్నించే అవకాశం
పార్టీ మారడంతో ఈటల వాంగ్మూలంపై సర్వత్రా ఆసక్తి
9న హరీశ్‌రావు, 11న కేసీఆర్‌ను విచారించనున్న కమిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను ప్రశ్నించనుంది. ఏడాది కాలంగా విచారణ జరుపుతున్న కమిషన్ ఎదుట ఓ ముఖ్య నేత హాజరై వాంగ్మూలనం ఇవ్వనుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి దఫా బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేసినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలు జరిగాయి.
బరాజ్‌ల నిర్మాణం సైతం అప్పుడే ప్రారంభమై పూర్తయ్యింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో పాటు ప్యాకేజీలవారీగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ఆర్థిక అనుమతులు, ఆ తర్వాత పనుల అంచనాల సవరణకు అనుమతి, రుణ సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) స్థాపనకు అనుమతుల జారీలో నాడు ఆర్థిక శాఖ కీలకంగా వ్యవహరించింది. ఈ నిర్ణయాల్లో ఈటల రాజేందర్ పాత్రపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది.
ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు కమిటీలకు ఈటల నేతృత్వం వహించగా, మరికొన్ని కమిటీల్లో ఆయన సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించింది. ఈ వ్యవహారాల్లో ఆయ న పాత్రపై కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ ఎదుట ఈటల ఇవ్వనున్న వాంగ్మూలం కీలకంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కమిషన్ ఈ నెల 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ను, 11న మాజీ సీఎం కేసీఆర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని కోరింది. వారికి ఇప్పటికే సమన్లు పంపించింది. వాస్తవానికి ఈ నెల 5నే కేసీఆర్‌ను ప్రశ్నించేందుకు కమిషన్ సమన్లు పంపగా, ఆయన అనారోగ్య కారణాలు చూపి మరి కొంత సమయం కోరారు. దీంతో 11వ తేదీన రావాలని కోరింది.