‘కరెంట్‌’కు మాన్సూన్‌ షాక్‌! | Electricity revenue decreased in May 2025 compared to May 2024 | Sakshi
Sakshi News home page

‘కరెంట్‌’కు మాన్సూన్‌ షాక్‌!

Jun 12 2025 3:32 AM | Updated on Jun 12 2025 3:32 AM

Electricity revenue decreased in May 2025 compared to May 2024

రోహిణి కార్తెలోనూ వర్షాలు.. ఎండలు లేక తగ్గిన వినియోగం

2024 మే నెలతో పోలిస్తే.. 2025 మేలో తగ్గిన విద్యుత్‌ రెవెన్యూ

అంచనాలు తలకిందులు కావడంతో ఖంగుతిన్న డిస్కం  

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణంగా వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎండ, ఉక్కపోత ఉంటే అంతమేర కరెంటు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా డిస్కంకు బిల్లుల రూపంలో రావాల్సిన రాబడి కూడా అధికంగా ఉంటుంది. కానీ, డిస్కం ఇంజనీర్ల అంచనాలను మాన్సూన్‌ తారుమారు చేసింది. ఆదాయానికి గండికొట్టింది. గ్రేటర్‌ జిల్లాల్లో విద్యుత్‌ వాడకం మే నెలలో ఐదువేల మెగావాట్లకు చేరుకుంటుందని డిస్కం అంచనా వేసింది. ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు కూడా చేసింది. 

అయితే అధికారుల అంచనాలకు భిన్నంగా మే రెండో వారం నుంచే పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం, ఎండలకు రోళ్లు, రోకళ్లు పగలాల్సిన రోహిణి కార్తెలోనూ ఏకధాటి వర్షాలు కురియడం, ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లను నిలిపివేయడం వల్ల నగరంలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. 2024 మే నెలతో పోలిస్తే 2025 మే నెలలో నమోదైన విద్యుత్‌ డిమాండ్‌లో భారీ వ్యత్యాసం నమోదైంది. ఫలితంగా వేసవిలో విద్యుత్‌ అమ్మకాల ద్వారా రావాల్సిన ఆదాయాన్ని సంస్థ కోల్పోవాల్సి వచ్చింది. 

గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న కోర్‌ సిటీ సర్కిళ్లతో పోలిస్తే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లు ఎక్కువగా ఉన్న శివారు సర్కిళ్లలో మాత్రం ఆదాయం అనూహ్యంగా పెరిగింది. అంతేకాదు 2023 మే నెలలో నమోదైన విద్యుత్‌ డిమాండ్‌తో పోలిస్తే 2024 మే నెలలో సగటు విద్యుత్‌ డిమాండ్‌ 13.9 శాతం పెరిగింది. అదేస్థాయిలో వినియోగం కూడా 12.6 శాతం పెరిగింది. 2024 మేలో రికార్డైన సగటు విద్యుత్‌ డిమాండ్‌తో పోలిస్తే 2025 మేలో 3.2 శాతం తగ్గింది. వినియోగం 2.5 శాతానికి పడిపోయి అధికారుల అంచనాలను తలకిందులు చేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement