
నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
ఇబ్బందుల్లో వినియోగదారులు
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
రామంతాపూర్, అంబర్‌పేట్, బండ్లగూడ దుర్ఘటనలతో చర్యలు
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ నగరవాసుల మృత్యువాతకు కారణమవుతున్న స్టార్ కేబుళ్లు, ఇంటర్నెట్ కేబుళ్ల తొలగింపు ప్రక్రియను రెండో రోజైన మంగళవారం కూడా చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, విద్యుత్ స్తంభాలకు ప్రమాదకరంగా మారిన కేబుళ్లను తొలగించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా టీవీ కేబుళ్లతో పాటు ఇంటర్నేట్ కేబుళ్లను కూడా తొలగించడంతో వినియోగదారులు ఇబ్బందుల పాలయ్యారు. ఇంట్లో టీవీ ప్రసారాలతో పాటు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచి్చంది. ఇళ్ల నుంచి పని చేసే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు.
వరుస ఘటనలతో సర్కారు సీరియస్..
ఏదైనా స్తంభం నుంచి కేబుల్ లాగాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒక్కో స్తంభానికి రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు చెల్లించాలి. కేబుళ్లు 15 ఫీట్ల ఎత్తులో అమర్చుకోవాలి. కానీ.. మెజార్టీ కేబుళ్లు పది అడుగుల ఎత్తులోనే కని్పస్తున్నాయి. సపోరి్టంగ్ వైరు, కేబుల్ గరిష్ట బరువు మీటర్‌కు 200 గ్రాములకు మించరాదు. స్తంభానికి స్తంభానికి మధ్య తీగల పొడవు 50 మీటర్లు మించరాదు. కానీ.. చాలా చోట్ల కేజీల కొద్దీ బరువున్న తీగలను చుట్టారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జంక్షన్ బాక్సులకు కరెంట్ వాడుతున్నారు. కనీసం నెలవారీ బిల్లు చెల్లించడం లేదు.
ఏ ఒక్క చోట కూడా మీటర్ ఉండదు. కానీ యథేచ్ఛగా విద్యుత్‌ను వాడుతుంటారు. నగరంలో ఈ తరహా కంపెనీలు 28కి పైగా ఉన్నట్లు అంచనా. ఆయా కేబుల్ ఆపరేటర్లతో ఇప్పటికే డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సమావేశమై..స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్థానిక నేతలు, ప్రభుత్వంలోని కొంత మంది పెద్దలతో ఒత్తిడి తీసుకొచి్చ, తొలగింపు ప్రక్రియను విస్మరించారు. తాజాగా రామంతాపూర్, అంబర్‌పేట్, బండ్లగూడ వరుస ఘటనలతో ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం నుంచి కేబుళ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించినప్పటికీ.. రెండో రోజైనా మంగళవారం మరింత వేగవంతం చేసింది.
విగ్రహాల తరలింపు పట్ల అప్రమత్తంగా ఉండాలి
గణేష్ విగ్రహాల తరలింపు విషయంలో అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ నిర్వాహకులకు సూచించారు. రామంతాపూర్, బండ్లగూడ, అంబర్‌పేట ఘటనల్లో విద్యుత్ అధికారుల తప్పిదం లేదని స్పష్టం చేశారు. ఇతర కారణాలే ఇందుకు కారణమని తెలిపారు. ఇప్పటికే ప్రమాదకరంగా మారిన ఎల్‌టీ, హెచ్‌టీ కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో ఏబీ కేబుల్ ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేసినట్లు తెలిపారు.
విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు తప్పనిసరి..
విగ్రహాల ఎత్తును బట్టి రూట్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.విద్యుత్ లైన్ల నుంచి కనీసం రెండు అడుగుల దూరం పాటించాలి. లైన్‌లో ప్రవహించే విద్యుత్ సరఫరా ప్రభావం/ఇండక్షన్ ఉంటుంది.
క్రేన్లు, ట్రక్కులు, ఎత్తైన మెటల్ విగ్రహాల తరలింపులో అప్రమత్తంగా ఉండాలి.
మెటల్ ఫ్రేమ్‌లతో కూడిన డెకరేషన్లను వీలైనంత వరకు తగ్గించాలి.
మండపాలకు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సామాన్యులు విద్యుత్ స్తంభాలు ఎక్కకూడదు. సంస్థ సిబ్బంది ద్వారానే కనెక్షన్ తీసుకోవాలి.
మండపాల్లో విద్యుత్ పనులు చేసేప్పుడు పరిసరాలను పూర్తిగా పరిశీలించాలి. విద్యుత్ తీగలు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలి.
వైరింగ్‌లో లీకేజీలు లేకుండా చూసుకోవాలి. వర్షానికి తేమతో షాక్ కొట్టే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలి.