నేడు మేయర్,  మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక 

Election Of Mayor Municipal Chairmen Today - Sakshi

 మధ్యాహ్నం 3.30 గంటలకు... 

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలూ టీఆర్‌ఎస్‌కే..  

ఆశావహుల వడపోత తర్వాత తుది జాబితాకు కేసీఆర్‌ ఆమోదం

మున్సిపాలిటీలకు వెళ్లిన పరిశీలకులు 

పార్టీ నిర్ణయం మేరకు సజావుగా ఎన్నిక జరిగేలా సీల్డ్‌ కవర్లు 

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులతో పాటు మరో ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవుల భర్తీ కోసం శుక్రవారం పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టారు. ఈ నెల 3న వెలువడిన ఫలితాల్లో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో  అన్ని చోట్లా ఇతర పార్టీలు, కో ఆప్షన్‌ సభ్యుల మద్దతు లేకుండానే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది.

అయితే సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు టీఆర్‌ఎస్‌ వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చం పేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు రెండు రోజుల క్రితమే పరిశీలకులను నియమించింది. పలువురు మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు కొందరు ముఖ్య నేతలకు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆయా ప్రాం తాల పరిధిలోని మంత్రులు, స్థానిక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తీసుకుని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశావహుల జాబితాకు తుది రూపం ఇచ్చారు. పేర్లను సీల్డ్‌ కవర్లలో గురువారం మధ్యా హ్నం పార్టీ పరిశీలకులకు అందజేశారు.

వీరు గురువారంరాత్రికే తమకు కేటాయించిన కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీకి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నిక జరగనుండగా, పార్టీ కొత్త కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమవుతారు. ఎన్నిక జరిగే తీరుతెన్నులను వివరించడంతోపాటు, సీల్డ్‌ కవర్‌లోని పార్టీ నిర్ణయాన్ని కూడా తెలియచేస్తారు. కో ఆప్షన్‌ సభ్యులతోపాటు కొత్తగా ఎన్నికైన వారితో కలిసి ఎన్నిక జరిగే సమావేశ మందిరానికి చేరుకుంటారు. రిజర్వేషన్‌ కేటగిరీ, విధేయత, సీనియారిటీ తదితరాలను ప్రాతిపదికగా తీసుకుని కేసీఆర్‌ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.
కార్పొరేషన్‌/                                                      మేయర్‌/చైర్మన్‌ 
మున్సిపాలిటీ                                                     ఆశావహులు 

వరంగల్‌                                                          గుండు సుధారాణి 
ఖమ్మం                                                           బీసీ లేదా కమ్మ సామాజికవర్గం 
సిద్దిపేట                                                కడవేర్గు మంజుల/ కొండం కవిత 
అచ్చంపేట                                         నర్సింహ గౌడ్‌/ గోపిశెట్టి శివ/ పోరెడ్డి శైలజ 
జడ్చర్ల                                                                  దోరేపల్లి లక్ష్మి 
కొత్తూరు                                                               కరుణ/ లావణ్య 
నకిరేకల్‌                                                 రాచకొండ శ్రీనివాస్‌/ కొండ శ్రీనుగౌడ్‌  

   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top