వరదలు తగ్గిన వెంటనే చర్యలు ప్రారంభిస్తాం
సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భూగర్భ పరీక్షలు
వాటి ఆధారంగా పునరుద్ధరణ డిజైన్ల తయారీ
డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాతే పనులు
సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిలో ప్రవాహం తగ్గిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరమ్మతులు నిర్వహించి, పునరుద్ధరణకోసం శాస్త్రీయ పద్ధతుల్లో కసరత్తు ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో జియోఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించి బరాజ్‌లకి ఎంత మేరకు నష్టం జరిగిందో అంచనా వేస్తామన్నారు.
దాని ఆధారంగా కన్సల్టెంట్లు బరాజ్‌ల పునరుద్ధరణకు ప్రణాళిక, డిజైన్లు, అంచనాలను సిద్ధం చేస్తాయన్నారు. పునరుద్ధరణ వ్యయాన్ని బరాజ్‌ల నిర్మాణ సంస్థలే భరిస్తాయని స్పష్టం చేశారు. కన్సల్టెంట్లు ఇచ్చిన డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాతే బరాజ్‌ల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామన్నారు. సాంకేతిక పటిష్టత, జవాబుదారీతనం, ప్రజాధనంతో కట్టిన ఆస్తులను వినియోగంలోకి తీసుకురావడమే తమ కర్తవ్యమన్నారు. బరాజ్‌ల పునరుద్ధరణపై బుధ వారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం భారీగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ బరాజ్‌లను బాధ్యతాయుతంగా పునరుద్ధరించడం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. బరాజ్‌లు దెబ్బతినడానికి రాజకీయ, సాంకేతిక స్థాయిల్లో జరిగిన లోపాలే కారణమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ), జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ విభాగం తమ విచారణలో తేల్చడంతో వాటిని సరిదిద్దే చర్యలు చేపట్టామన్నారు. అత్యున్నత సాంకేతిక అర్హతలు కలిగిన స్వతంత్ర సంస్థలు, కన్సల్టెంట్ల సహకారంతో వాటి పునరుద్ధరణ పనులకు డిజైన్లను తయారు చేయిస్తున్నామన్నారు.
పునరుద్ధరణ చర్యలకు మార్గదర్శకత్వం కోసం కేంద్ర జలసంఘాన్ని (సీడబ్ల్యూసీ) సంప్రదిస్తే.. అర్హతలు, అనుభవం కలిగిన సాంకేతిక నిపుణులు డిజైన్లను రూపొందిస్తే వాటిని పరిశీలించి ఆమోదించడంతో పాటు పనుల నిర్వహణలో సహకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఐఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థలతో ఒప్పందం చేసుకుని ఉండడంతో పాటు డ్యామ్‌ల భద్రతలో అనుభవం కలిగి ఉన్న కంపెనీలకే పనుల్లో ప్రాధాన్యమిస్తామన్నారు. వాటి ఆర్థిక సామర్థ్యాన్ని పరిశీలించి మూడు కంపెనీలను షార్ట్‌లిస్టు చేస్తామన్నారు.
సత్వరంగా సమ్మక్క.. అనుమతులు తేవాలి
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ నుంచి సత్వరంగా నిరభ్యంతర పత్రాన్ని రాబట్టుకుని ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) అనుమతులు పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. మోడికుంటవాగు, చనాకా–కొరాటా, చిన్నకాళేశ్వరం, సీతమ్మసాగర్ ప్రాజెక్టులకు సత్వరంగా ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్‌లను సాధించాలని కోరారు.
దేవాదుల ప్రాజెక్టులోని ప్యాకేజీ–6 పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ(జనరల్) అంజాద్ హుసేన్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


