‘టెట్‌’ దరఖాస్తు గడువు పెంపు!  | Sakshi
Sakshi News home page

‘టెట్‌’ దరఖాస్తు గడువు పెంపు! 

Published Wed, Apr 10 2024 5:48 AM

Education Department proposal to Telangana Govt On TSTET - Sakshi

ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదన.. 

ఎన్‌సీటీఈ స్పష్టత కోసం నిరీక్షణ 

తగ్గిన టెట్‌ దరఖాస్తులు 

ముందుకు రాని సర్వీస్‌ టీచర్లు 

గడువు పెంచితే దరఖాస్తులు పెరిగే అవకాశం 

నేడు ఉత్తర్వులు! 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్‌ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్‌ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్‌ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  

3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు 
టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. 
 
ఎన్‌సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 
80 వేల మంది టీచర్లు టెట్‌ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్‌ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రమోషన్‌కు టెట్‌ అవసరం. కానీ ఎస్‌జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్‌ హెచ్‌ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్‌ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు.

అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. 
 
పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. 
కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్‌ పరీక్ష మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్‌ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. 
 
డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్‌ 
డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. 
 
గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్‌ రెడ్డి (డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) 
టెట్‌ అప్లికేషన్స్‌ గడువు పెంచి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలి. ఉగాది, రంజాన్‌ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్‌లో టెట్‌ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది.  
 
స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 
సర్వీస్‌ టీచర్లలో ఎంత మంది టెట్‌ రాయాలి? ఏ పేపర్‌ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్‌సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ దరఖాస్తుల గడువు పెంచాలి.   

Advertisement
Advertisement