డీఎస్సీ–2025లో మెరిట్ విద్యార్థులకు అన్యాయం
హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
తమకు మెరిట్ ఉన్నా ఎస్జీటీ పోస్టులు ఇవ్వడంపై అభ్యంతరం
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే సహించబోమని ఇటీవల హెచ్చరించడంతోపాటు, వారికి రెండు నెలల్లోగా అర్హత సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన పోస్టు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇందుకు చంద్రబాబు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పటికే నియామకాలు పూర్తి చేశామని, ఇవ్వడం కుదరదని చెప్పింది. పైపెచ్చు హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు విద్యా శాఖ సిద్ధమవుతోంది.
చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాట్లు పడుతోందేగానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మాత్రం అంగీకరించడం లేదు. డీఎస్సీ–2025 అభ్యర్థుల జీవితాలతో ఆది నుంచి ఆడుకున్న ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు సమయంలోనే తొలి ప్రాధాన్య పోస్టు ఏదో అభ్యర్థులను ఎంచుకోమంది. అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా ఏ పోస్టు ఎంచుకుంటే అదే పోస్టు వస్తుందని ప్రకటించింది.
ఈ విధానం గతంలో ఎప్పుడూ లేదు. కౌన్సెలింగ్ సమయంలో మాత్రమే పోస్టుల ప్రాధాన్యం అడిగేవారు. దాని ద్వారా అభ్యర్థులు తాము మెరిట్ సాధించిన వాటిలో ఉన్నత పోస్టును పొందే అవకాశం ఉండేది. ఈసారి దరఖాస్తు సమయంలోనే అడగడంతో వందలాది అభ్యర్థులు ఉన్నత పోస్టులను కోల్పోయారు. డీఎస్సీ –2025 ఫలితాలు ప్రకటించాక దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఎస్జీటీ తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నా స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా సాధించారు.
అయితే వారికి తొలి ప్రాధాన్యమైన ఎస్జీటీ పోస్టు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అంతకంటే మంచి పోస్టులైన స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారికి ఆ పోస్టులు ఇవ్వలేదు. దీంతో 54 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
తాము ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నతమైన పోస్టును కోల్పోతున్నామని, గతంలో కౌన్సెలింగ్ దశలో అభ్యర్థులకే పోస్టు ప్రాధాన్యం ఎంచుకునే వెసులుబాటు ఉండేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కుగా హైకోర్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యత ఎంపిక విధానంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు బేఖాతర్
హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా ఆగస్టు 11న ఫలితాలను, 21న మెరిట్ లిస్టును ప్రకటించడంతోపాటు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసింది. అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం హడావుడిగా గతేడాది సెపె్టంబర్‌లో పోస్టింగులు సైతం పూర్తి చేసింది. దీనిపై హైకోర్టు సెపె్టంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మెరిట్ విద్యార్థులకు పోస్టులు ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించింది.
కానీ దీన్ని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా సెపె్టంబర్ 15న సెలక్షన్ లిస్టును విడుదల చేసి, ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు బెంచ్ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసి, మెరిట్‌కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 29న తుది తీర్పునిస్తూ మెరిట్‌కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టింగ్స్ పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది.
న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎలా పోస్టులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన 54 మంది మెరిట్ అభ్యర్థులతోపాటు ఆర్థి కారణలతో హైకోర్టుకు వెళ్లలేని వారికీ న్యాయం దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించకుండా మరోసారి అప్పీల్‌కు వెళ్లే యోచన చేస్తుండడం గమనార్హం. న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయని ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి.


