నౌహీరా షేక్ అక్రమార్జన కేసులో ఈడీ చర్యలు
బాధితులకు నష్టపరిహారం అందిస్తామన్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీల అధిపతి నౌహీరా షేక్‌పై నమోదైన అక్రమార్జన కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. నౌహీరా షేక్‌కు చెందిన రూ.19.64 కోట్ల విలువైన ఒక ఆస్తిని వేలం వేసి విక్రయించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ యూనిట్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వేలం వేసిన ఆస్తుల రిజి్రస్టేషన్ కూడా శుక్రవారం పూర్తయిందని వెల్లడించింది. 2019 ఆగస్టు 16న తాత్కాలికంగా జప్తు చేసిన ఈ ఆస్తిని.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద దర్యాప్తులో భాగంగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, కేరళ తదితర రాష్ట్రాల పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
నౌహీరా షేక్, ఆమె సహచరులు ఏటా 36 శాతం కంటే ఎక్కువ లాభం ఇస్తామని హామీ ఇచ్చి ప్రజల నుంచి మొత్తం రూ.5,978 కోట్లకుపైగా పెట్టుబడులు సేకరించారు. కానీ అసలు కూడా తిరిగి ఇవ్వకుండా లక్షలాది మంది పెట్టుబడిదారులను మోసం చేశారు. ఇలా కొల్లగొట్టిన డబ్బుతో నౌహీరా షేక్ తన పేరు, తన కంపెనీల పేరు, బంధువుల పేర్ల మీద భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు రూ.428 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్, సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లను హైదరాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో మోసపూరితంగా నష్టపోయిన పెట్టుబడిదారులకు నష్టపరిహారం అందించేందుకు జప్తు చేసిన ఆస్తులను వేలం వేయడానికి ఈడీ న్యాయస్థానాన్ని అనుమతి కోరింది. సుప్రీం ఆమోదం తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభించింది. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని నౌహీరా షేక్ , హీరా గ్రూప్ మోసంతో నష్టపోయిన పెట్టుబడిదారులకు పరిహారంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.


