ఏడాదిన్నర క్రితంనాటి హత్యకేసును ఛేదించిన పోలీసులు
ఆరుగురు నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: ఓ వృద్ధురాలిని హత్యచేసిన ఇద్దరు వ్యక్తులు జైలుకెళ్లారు. తర్వాత బెయిల్‌పై తిరిగొచ్చారు. మరో నలుగురితో కలిసి గతంలో చేసిన మరో హత్య గురించి చర్చించుకుంటున్న సమయంలో విషయం పోలీసుల చెవిలో పడింది. వారు దర్యాప్తు చేయగా.. ఏడాదిన్నర క్రితం కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన అనుమానాస్పద మృతి ఘటన హత్యగా తేలింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చూపారు.
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేశ్ (40), దేవునూరి సతీశ్ మధ్య భూమి విక్రయం విషయంలో విభేదాలు వచ్చాయి. అదే సమయంలో ఓ మహిళతో సన్నిహితంగా ఉంటున్న సతీశ్ సమీప బంధువు దేవునూరి సంతోష్ ను దినేశ్ బెదిరించాడు. ఈ విషయాన్ని సతీశ్ సోదరుడు శ్రావణ్‌కు చెప్పారు. ముగ్గురూ కలిసి దినేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు.
2024 ఫిబ్రవరి 25న శ్రావణ్ సమీప బంధువు చనిపోగా దినేశ్ అక్కడికి వచ్చాడు. ఇదే అదనుగా సతీశ్.. దినేశ్‌ను మద్యం తాగుదామని బయటకు తీసుకెళ్లాడు. అప్పటికే కారు అద్దెకు తీసుకున్న సంతోష్, శ్రావణ్, దేవునూరి రాకేశ్, కుమ్మరి వికేశ్, జంగ చిన్నారెడ్డి, సతీశ్‌తో కలిసి దినేశ్‌ను మల్కాపూర్ కెనాల్ వద్దకు తీసుకెళ్లి చితకబాదారు.
తర్వాత కారులో ఎక్కించుకుని జగిత్యాల జిల్లా నూకపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ మెడకు తాడుబిగించి చంపేందుకు యత్నించారు. దినేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కాళ్లు, చేతులు కట్టి చొప్పదండి శివారులోని కెనాల్‌లో పడేశారు. కొద్దిరోజులకు మృతదేహం లభ్యం కాగా చొప్పదండి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వృద్ధురాలిని హత్యచేసి..
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆగస్టులో దేవునూరి సతీశ్, శ్రావణ్ మరో ముగ్గురితో కలిసి గంగాధరలో ఓ వృద్ధురాలిని బంగారం, భూమి కోసం హత్య చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి జైలుకు తరలించగా.. ఇటీవలే బెయిల్‌పై వచ్చారు.
ఈ క్రమంలో సతీశ్, శ్రావణ్‌తో పాటు మరికొందరు కలిసి ఒకరోజు దినేశ్‌ను హత్యచేసిన విషయమై చర్చించుకుంటుండగా విషయం అప్పటికే వారిపై నిఘా పెట్టిన పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు సంతోష్, శ్రావణ్, రాకేశ్, సతీశ్, కుమ్మరి వికేశ్, జంగ చిన్నారెడ్డిని తమదైన శైలిలో విచారించగా.. దినేశ్‌ను తామే చంపామని ఒప్పుకున్నారు.
నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసును ఛేదించిన చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, చొప్పదండి ఎస్సై నరేశ్‌రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, రామడుగు ఎస్సై రాజును సీపీ గౌస్ ఆలం అభినందించి, రివార్డులు అందించారు.


