శనివారం మెట్రో రైలులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, అజహరుద్దీన్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
మెట్రో, ఆర్టీసీ బస్సులో సహచర మంత్రులతో కలిసి ప్రయాణం
కామన్‌పాస్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణికుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సమగ్ర ప్రజారవాణా వ్యవస్థ ద్వారా నగరంలో ప్రయాణం సులభతరమవుతుందని, ప్రజారవాణా సంస్థలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడం వల్ల ప్రయాణికులు తమకు అనువైన వ్యవస్థను ఎంపిక చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ సదుపాయాన్ని, ప్రయాణికుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్, నవీన్ యాదవ్‌లు అధికారులతో కలిసి శనివారం మెట్రోరైల్, సిటీబస్సులో ప్రయాణం చేశారు. మొదట బేగంపేట్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో పయనించారు.
ఈ సందర్భంగా కామన్‌పాస్ వినియోగంపైన ఆయన ప్రయాణికులతో మాట్లాడారు. మెట్రో ప్రయాణం అనంతరం గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆర్టీసీబస్సు సేవలు అందుబాటులో ఉండడంవల్ల సమయం ఆదా అవుతుందని, కానీ అన్ని చోట్ల లాస్ట్‌మైల్ కనెక్టివిటీ లేకపోవడంవల్ల ఇబ్బందిగా ఉంటోందని పలువురు ప్రయాణికులు డిఫ్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. రెండు సార్లు టిక్కెట్ తీసుకోవలసిన ఇబ్బంది తప్పిందని, కామన్‌పాస్ చార్జీలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు.అనంతరం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి సిటీబస్సులో సెక్రటేరియట్ వరకు పయనించారు. బస్సులోనూ ప్రయాణికులతో ముచ్చటించారు.
ఒకే పాస్‌తో మెట్రో, సిటీ బస్సులను వినియోగించుకోవడం వల్ల ఎలాంటి గందరగోళానికి తావు ఉండదని ఈ సందర్భంగా భట్టి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మెట్రో–ఆర్టీసీ సేవలను అనుసంధానం చేశామని, భవిష్యత్తులో ఆటోలు, ఊబర్ వంటి ఇతర రవాణా సేవలను కూడా అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజా రవాణా వైపు ఆకర్షించాలంటే ఆర్టీసీ, మెట్రో సేవలను సమన్వయంతో, సౌకర్యవంతంగా అందించాల్సిన అవసరముందన్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని కామన్ పాస్ సేవలను మరింత మెరుగుపరుస్తామని పొన్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్‌పోర్ట్–మెట్రో) ఎన్‌వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


