- పుష్ప సినిమా తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి స్మగ్లింగ్
- లారీలో స్పెషల్ అర ఏర్పాటు చేసి అందులో రవాణా చేస్తున్న ముఠా
ఈగల్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు, ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈగల్ ఫోర్స్, ఖమ్మం ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం (ఆర్‌ఎన్‌సీసీ), భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు సంయుక్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం శరపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డు అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ పశ్చిమ గేటు వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.62 కోట్ల విలువైన 525 కిలోల గంజాయి, ఒక కంటైనర్ లారీ, ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, 5 మొబైల్ ఫోన్లు, రూ.10,570 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పుష్ప సినిమాలోలా లారీలో దాచి..
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లారీలో గంధపు చెక్కలను ప్రత్యేక అర కింద దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెంలోనూ నిందితులు గంజాయిని తీసుకెళ్లడానికి ఇటువంటి ప్రయత్నమే చేశారు. నిందితుడు సహదేవ్ హంతాల్ ఒడిశాలోని అల్లూరికోట అటవీ ప్రాంతంలో గంజాయిని సేకరించినట్టు పోలీసులు గుర్తించారు.
అక్కడి నుంచి గంజాయి మూటలను తులసిపాకకు తరలించేందుకు కూలీల బృందాన్ని నియమించాడు. ఆ తర్వాత ఆ గంజాయిని మహమ్మద్ సైఫ్, ఫిరోజ్ భాయ్‌కు చెందిన కంటైనర్ లారీలో ఎక్కించారు. అధికారులు, సిబ్బందికి కనిపించకుండా గంజాయిని దాచేందుకు లారీలో ప్రత్యేక అర ఏర్పాటు చేశారు.
ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని తులసిపాక, మోతుగూడెం నుంచి తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ మీదుగా మహారాష్ట్ర దాటి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ఖమ్మం ఆర్‌ఎన్‌సీసీ, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని తులసిపాక నుంచి తెలంగాణలోని బూర్గంపాడు వరకు కంటైనర్ లారీ, దానికి ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ కదలికలను గమనించారు.
శరపాకలోని ఐటీసీ పేపర్స్ బోర్డు అండ్ స్పెషాలిటీ పేపర్స్ డివిజన్ పశ్చిమ గేటు వద్ద మంగళవారం రెండు వాహనాలను అడ్డగించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులతో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
నిందితుల వివరాలు
సహదేవ్ హంతాల్, 20 సంవత్సరాలు, సరఫరాదారు, సిందూర్‌పల్లి, కుర్మనూరు, చిత్రకొండ, కాలిమేళా, మల్కన్‌గిరి జిల్లా (ఒడిశా)
దోగ్రి త్రినాథ్, 38 సంవత్సరాలు, ఎస్కార్ట్, మారేడుమిల్లి, సోమిరెడ్డిపాలెం, అల్లూరి సీతారామరాజు జిల్లా (ఆంధ్రప్రదేశ్)
కుల్దీప్ శర్మ, 27 సంవత్సరాలు, డ్రైవర్, బిజాపూర్, ససుని, అత్రోస్ (ఉత్తరప్రదేశ్)
పరారీలో ఉన్న నిందితులు (సరుకు స్వీకరించేవారు)
మహమ్మద్ సైఫ్, అనీఫ్ యాకూబ్ కుమారుడు, ట్రక్ యజమాని, తవీద్ మెయిన్ బజార్, సూరత్
ఫిరోజ్ భాయ్
రాజా మిశ్రా
మహమ్మద్ ఇమ్రాన్
(వీరంతా ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు)


