170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం' | Sakshi
Sakshi News home page

170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం'

Published Wed, Mar 27 2024 12:38 AM

Drastically reduced state average groundwater levels - Sakshi

భారీగా తగ్గిన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు 

గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో 4.5 అడుగుల మేర క్షీణత 

రాష్ట్రవ్యాప్తంగా 8% భూభాగంలో 65 అడుగులకుపైగా పతనమైన నీటిమట్టాలు 

వికారాబాద్‌ జిల్లాలో అత్యంత ప్రమాదకర స్థాయిలో తగ్గుదల 

కృష్ణా బేసిన్‌ జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో నల్లగొండ జిల్లాపై ప్రభావం 

ఒక్క జగిత్యాల జిల్లాలో మాత్రమే సురక్షిత స్థాయిలో భూగర్భ జలాలు  

33 జిల్లాల స్థితిగతులపై భూగర్భజల శాఖ నివేదికలో ఆందోళనకర అంశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు ప్రమా­ద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు (24.08 అడుగులు) ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్ల (28.54 అడుగులు)కు పడిపోవడమే అందుకు కారణం.

గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల (4.46 అడుగుల) మేర భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే ఒక మీటర్‌ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భజల శాఖ రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. 

11 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ... 
జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లకుపైన అనే కేటగిరీలుగా భూగర్భజలశాఖ వర్గీకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్‌ జిల్లాలో 13.07 మీటర్ల (42.8 అడుగులు)కు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం జగిత్యాల జిల్లా 4.93 మీటర్ల (16.17 అడుగులు) భూగర్భ జలమట్టంతో 0–5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లకన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు (32.8 అడుగులు)పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. 

30 జిల్లాల్లో క్షీణత నమోదు.. 
గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్లగొండ జిల్లాపై తీవ్ర దుష్ప్రభావం పడినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

ఈ జిల్లాల్లో అత్యంత ప్రమాదకరం.. 
సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్‌ జిల్లాలోని దక్షిణమధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మోస్తారు లోతు (మోడరేట్లీ డీప్‌), 20 మీటర్లకుపైన తీవ్ర లోతు (వెరీ డీప్‌)ల్లో ఉన్నట్టు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8 శాతం ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24 శాతం ప్రాంతం పరిధిలో 10–15 మీటర్లు, 53 శాతం ప్రాంతం పరిధిలో 5–10 మీటర్లు, 15 శాతం ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. 

170 మండలాల్లో దశాబ్ద కాల కరువు... 
రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల (2014–2023) సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 (28%) మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 (72%) మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement