బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వ వాదన
సాక్షి, అమరావతి: కృష్ణాబేసిన్ లోపల, వెలుపలి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం తాము చేస్తున్న నీటివినియోగానికి రక్షణ కల్పించాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ట్రిబ్యునళ్ల సాధారణ నిబంధనలు, హెల్సింకీ నియమాలు, బెర్లిన్ నియమాలు, జాతీయ జలవిధానం, అంతర్‌రాష్ట్ర నదీజల వివాదాల చట్టం, ఏపీ పునర్విభజన చట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్‌గుప్తా, న్యాయవాది ఉమాపతి వాదనలు వినిపించారు.
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో ఎస్.తాళపత్ర, జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ట్రిబ్యునల్ ఎదుట ఏపీ తరఫున తుది వాదనల్ని వీరు రెండోరోజు గురువారం కొనసాగించారు. బేసిన్ వెలుపల, బయట అనే తేడా లేకుండా ప్రస్తుత వినియోగానికి రక్షణ కల్పించాల్సిందేనని ట్రిబ్యునల్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కావేరి ట్రిబ్యునల్‌లో చర్చ తర్వాత ప్రస్తుత వినియోగానికి రక్షణ కల్పిస్తూ తీర్పువచ్చిందని గుర్తుచేశారు.
ప్రత్యామ్నాయ జలవనరులున్నా కృష్ణా జలాలను వాడుకుంటున్న ఏపీలోని బేసిన్ వెలుపలి ప్రాంతాలతో పోలిస్తే.. అత్యంత నీటి ఆవశ్యకత ఉన్న తెలంగాణలోని బేసిన్ లోపలి ప్రాంతాలే నీటికేటాయింపులకు అర్హత కలిగి ఉంటాయని తెలంగాణ చేస్తున్న వాదనను ట్రిబ్యునల్ గుర్తుచేయగా.. బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ప్రత్యామ్నాయ జలవనరులు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమని జైదీప్‌గుప్తా స్పష్టం చేశారు. రాయలసీమలో సరిపడ నీటిలభ్యత ఉందని పేర్కొంటూ ఆ ప్రాంతానికి కేటాయించిన జలాలను తెలంగాణకు పునఃకేటాయించాలని ఆ రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చాలని కోరారు.
కృష్ణాజలాలను ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు పంపిణీ చేస్తూ కృష్ణా ట్రిబ్యునల్–2 గతంలో ఇచ్చిన తుది నివేదికకు తెలంగాణ సైతం కట్టుబడి ఉండాల్సిందేనని.. లేకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీకి తిరిగి కేటాయింపులు చేయాల్సి ఉంటుందని వాదించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని కోరారు. తుది వాదనలను శుక్రవారం కూడా జైదీప్‌గుప్తా, ఉమాపతి కొనసాగించనున్నారు.


