Double Decker Buses Hyderabad: కేటీఆర్‌ భరోసా.. హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు!

Double Decker Buses Coming Into The City Again - Sakshi

సాక్షిహైదరాబాద్‌: డబుల్‌ డెక్కర్‌ బస్సులపై మరోసారి కదలిక వచ్చింది. నిధుల కొరత కారణంగా ఈ బస్సుల కొనుగోళ్లపై వెనకడుగు వేసిన ఆర్టీసీకి మంత్రి కేటీఆర్‌ భరోసా ఇవ్వడంతో ఆశలు చిగురించాయి. నగరంలోని వివిధ రూట్‌లలో ఈ బస్సులను నడిపేందుకు  బస్సుల కొనుగోళ్ల కోసం రూ.10 కోట్లు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. హెచ్‌ఎండీఏ నుంచి ఈ నిధులను  అందజేయనున్నట్లు తెలిపారు. దీంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులపై మరో అడుగు పడినట్లయింది.  

10 బస్సుల కొనుగోలుకు నిధులు.. 
హైదరాబాద్‌ నగరానికి వన్నెలద్దిన డబుల్‌ డెక్కర్‌ బస్సులపై మంత్రి  గతంలో తన అనుభవాలను  ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. ప్రజారవాణాకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు ఆ  బస్సులను తిరిగి ప్రవేశపెట్టడంపై ఆయన ఆసక్తి చూపారు. దీంతో డబుల్‌ డెక్కర్‌  బస్సులపై అప్పట్లో ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. రూట్‌ సర్వే నిర్వహించింది. బస్సుల కొనుగోళ్లకు టెండర్‌లను సైతం ఆహ్వానించింది. పలు సంస్థలు ముందుకొచ్చాయి. 

కానీ నిధుల కొరత  కారణంగా ఈ  ప్రతిపాదన వాయిదా పడింది. మరోవైపు కోవిడ్‌ నేపథ్యంలో కొత్త బస్సుల కొనుగోళ్లు తెరమరుగైంది. భారీగా  పెరిగిన అప్పుల కారణంగా కూడా ఆర్టీసీ  సాహసం చేయలేకపోయింది. తాజాగా 10 డబుల్‌ డెక్కర్‌ బస్సుల కొనుగోళ్లకు తన శాఖ నుంచి నిధులు కేటాయించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో  ఆర్టీసీ  అధికారవర్గాలు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. 

ఆర్టీసీకి పూర్వవైభవం.. 
వైవిధ్యభరితమైన హైదరాబాద్‌ నగరంలో 2006 వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు నడిచాయి. సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా జూపార్కు వరకు, సికింద్రాబాద్‌ నుంచి  అఫ్జల్‌గంజ్‌ వరకు, సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం తదితర రూట్‌లలో ఆకుపచ్చ రంగులో ఉండే రెండంతస్తుల డబుల్‌ డెక్కర్‌లు పరుగులు  తీసేవి. ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్‌లు విధులు నిర్వహించేవారు.  

బస్సు రెండో అంతస్తులో కూర్చొని ప్రయాణం చేయడం గొప్ప అనుభూతి. హైదరాబాద్‌ అందాలను విహంగ వీక్షణం చేస్తున్న భావన కలిగేది. కానీ నగరం విస్తరణ, అభివృద్ధిలో భాగంగా  ఫ్లైఓవర్‌లు  అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. పలు చోట్ల బస్సులు మలుపు తీసుకోవడం అసాధ్యమైంది. దీంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులను నిలిపివేశారు. మంత్రి కేటీఆర్‌ ఈ బస్సులను తిరిగి ప్రవేశపెట్టాలని రెండేళ్ల  క్రితం ప్రతిపాదించడంతో అప్పటి నుంచి ఇవి చర్చనీయాంశంగా మారాయి.  

మూడు రూట్ల ఎంపిక... 
డబుల్‌ డెక్కర్‌ బస్సుల కోసం మూడు రూట్లను ఎంపిక చేశారు. పటాన్‌చెరు–కోఠి (218), జీడిమెట్ల– సీబీఎస్, (9 ఎక్స్‌), అఫ్జల్‌గంజ్‌–మెహిదీపట్నం (118) రూట్లలో  డబుల్‌ డెక్కర్‌లను ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 10 బస్సుల కోసం ప్రతిపాదనలు రూపొందించారు. టెండర్‌లను ఆహ్వానించారు. నిధుల కొరత కారణంగా కొనుగోళ్లను నిలిపివేశారు.  

(చదవండి: అక్కడ చంద్రుడు.. ఇక్కడ రాముడు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top