కరోనా టీకా కోసం వెళ్తే.. కుక్క కాటు వ్యాక్సిన్ వేశారు

Doctors Inject To Rabies Vaccine  - Sakshi

కట్టంగూర్‌:  చదువురాని మహిళ.. కరోనా వ్యాక్సిన్‌ కోసమని ఆస్పత్రికి వెళ్లింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలంటూ ఆమె పనిచేస్తున్న బడి హెడ్‌మాస్టర్‌ రాసిచ్చిన లేఖనూ తీసుకెళ్లి చూపించింది. కానీ ఆస్పత్రి సిబ్బంది ఆమెకు కుక్కకాటు టీకా వేయడంతో భయాందోళనకు లోనైంది. నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో మంగళవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. కట్టంగూర్‌ మండలం బొల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో పి.ప్రమీల స్కావెంజర్‌గా పనిచేస్తోంది.

ఆమెకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయాలని వైద్యాధికారిని కోరుతూ పాఠశాల హెచ్‌ఎం లెటర్‌ రాసి ఇచ్చారు. ప్రమీల ఆ లేఖ తీసుకుని మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూర్‌ పీహెచ్‌సీకి వచ్చింది. చదువురాని ఆమె కరోనా వ్యాక్సిన్‌ క్యూ ఏదో తెలియక.. సాధారణ టీకాలు వేసే లైన్‌లో నిలబడింది. ఆమె ముందు అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ మహిళ ఉంది. నర్సు ఆ మహిళకు యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ (ఏఆర్‌వీ) ఇచ్చింది. తర్వాత ప్రమీల వంతురాగా.. కరోనా వ్యాక్సిన్‌ వేయాలంటూ హెచ్‌ఎం ఇచ్చిన లెటర్‌ను నర్సుకు ఇచ్చింది. కానీ నర్సు ఆ లెటర్‌ను చదవకుండానే.. అదే సిరంజితో ప్రమీలకు ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ వేసింది.

ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్‌ ఎలా ఇస్తారని ప్రమీల నిలదీయగా.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్నవారు లెటర్‌ చదివి.. ఇది కరోనా లైన్‌ కాదని, తనకు వేసింది కుక్కకాటు వ్యాక్సిన్‌ అని చెప్పడంతో ప్రమీల భయాందోళనకు గురైంది. ఒకే సిరంజితో ఇద్దరికి ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ను వేయడం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆమెకు ఏఆర్‌వీ వేయలేదు: వైద్యాధికారి
ప్రమీల కరోనా వ్యాక్సిన్‌ క్యూలో కాకుండా సాధారణ ఏఆర్‌వీ, టీటీ వ్యాక్సిన్‌ లైన్‌లో నిలబడిందని.. దాంతో నర్సు ఆమె కుక్కకాటు టీకా కోసం వచ్చినట్టు భావించి టీటీ ఇంజక్షన్‌ వేశారని వైద్యాధికారి కల్పన వివరణ ఇచ్చారు. వేర్వేరు సిరంజిలతో అయిటిపాముల మహిళకు ఏఆర్‌వీ, ప్రమీలకు టీటీ ఇచ్చినట్టు తెలిపారు. టీటీతో ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. 

చదవండి: 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top