చికిత్స చేసిన డాక్టర్‌కే ఒమిక్రాన్‌

Doctor Falls Prey To Infection After Treating Omicron Variant Patient - Sakshi

సూడాన్‌ నుంచి వచ్చిన క్యాన్సర్‌ రోగి ద్వారా వ్యాప్తి

రాష్ట్రంలో తొలి ప్రైమరీ కాంటాక్ట్‌ కేసు

ఒక్కరోజులో మరో నలుగురికి కొత్త వేరియెంట్‌

రాష్ట్రంలో 24కు చేరిన ఒమిక్రాన్‌ బాధితులు

వీళ్లలో ముప్పు లేని దేశాల నుంచి వచ్చినవాళ్లే 19 మంది 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుడికి కరోనా ఒమిక్రాన్‌ వేరియెంట్‌ సోకింది. సూడాన్‌ దేశం నుంచి వచ్చిన ఓ ఒమిక్రాన్‌ రోగికి (44) క్యాన్సర్‌ చికిత్స చేస్తుండగా ఆ వైద్యుడికి వైరస్‌ వ్యాపించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ డాక్టర్, పేషెంట్‌తో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరినీ ఆస్పత్రి యాజమాన్యం క్వారంటైన్‌కు పంపింది.

ఇలా రాష్ట్రంలో ఒకరి నుంచి మరొకరికి ఒమిక్రాన్‌ వ్యాపించడం ఇదే తొలిసారి. డాక్టర్‌తో కలిపి మంగళవారం రాష్ట్రంలో 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మిగిలిన ముగ్గురిలో ఒకరు సూడాన్‌ వాసి, ఇద్దరు సోమాలియా దేశస్తులు. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. వీళ్లందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 

వైద్యారోగ్య శాఖ అప్రమత్తం
సూడాన్‌ దేశం నుంచి ఈ నెల 14న క్యాన్సర్‌ రోగి నగరానికి వచ్చారు. సూడాన్‌ నాన్‌ రిస్క్‌ కేటగిరీలో ఉండటంతో ప్రయాణికులకు ర్యాండమ్‌గా టెస్టులు చేసి పంపారు. ఆ సుడాన్‌ వాసికి ఇక్కడి ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. అయితే ఆయనకు కరోనా ఉందని వెల్లడవడంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌ ఉన్నట్టు 16న తేలింది.

అయితే ఆ క్యాన్సర్‌ రోగికి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆస్పత్రి వర్గాలు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో వైద్యుడికి కొత్త వేరియెంట్‌ వ్యాపించింది.  అప్రమత్తౖమైన వైద్యారోగ్య శాఖ ఆ వైద్యుడి కుటుంబీకులు, అతనితో సన్నిహితంగా మెలిగిన ఇతర వైద్య సిబ్బంది, రోగుల నుంచి నమూనాలను సేకరిస్తోంది. ఆ వైద్యుడి నుంచి ఇంకెంతమందికి వైరస్‌ అంటిందోనని ఆందోళన నెలకొంది.  

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మరో 726 మంది 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 726 మంది ప్రయాణికులు వచ్చారు. వీళ్లలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను సీక్వెన్సింగ్‌కు పంపారు. మొత్తం 13 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వాళ్లు 19 మంది ఉన్నారు. 

కొత్తగా 172 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,79,892కు పెరిగింది. వైరస్‌ బారిన పడి మరొకరు కన్నుమూశారు. ఇప్పటి వరకూ 4,016 మంది మృతిచెందారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top