ఫీవర్‌ తెప్పించిన ఫిజిక్స్‌ | Dissatisfaction with the JEE on the first day | Sakshi
Sakshi News home page

ఫీవర్‌ తెప్పించిన ఫిజిక్స్‌

Jan 22 2026 4:18 AM | Updated on Jan 22 2026 4:18 AM

Dissatisfaction with the JEE on the first day

లెక్కల్లో సగం తిప్పలే..కెమిస్ట్రీ ఒక్కటే హాట్‌ కేక్‌ 

మొత్తంగా జేఈఈ మెయిన్స్‌ పేపర్‌ కఠినమే 

తొలి రోజు జేఈఈపై అసంతృప్తి 

బట్టీ చదువుల విద్యార్థుల బోల్తా 

సమయం తినేసిన సుదీర్ఘ ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్స్‌ తొలి రోజే దడ పుట్టించింది. ప్రశ్నపత్రం కఠినంగా ఉందని విద్యార్థులు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిజిక్స్‌ ప్రశ్నలున్నాయని తెలిపారు. కెమిస్ట్రీ సులభంగానే ఉందన్నారు. జేఈఈ మెయిన్స్‌ తొలి విడత బుధవారం నుంచి మొదలైంది. పలు పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు పరీక్ష రాసిన విద్యార్థులు ‘సాక్షి’ప్రతినిధులతో మాట్లాడారు. 

మొత్తంగా పరీక్ష కఠినంగానే ఉందని అభిప్రాయపడ్డారు. పెద్దగా స్కోర్‌ చేసే అవకాశం లేదన్నారు. కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థుల్లోనూ పూర్తి విశ్వాసం కనిపించలేదు. బట్టీ పట్టించే విధానంలో సబ్జెక్టులు పూర్తి చేయడమే విద్యార్థులకు జేఈఈ శాపంగా మారిందని నిపుణులు అంటున్నారు. వివిధ రూపాల్లో ప్రశ్నలు రావడంతో సరైన సమాధానం ఎంపికలో గందరగోళానికి గురయ్యారని జేఈఈ అధ్యాపక నిపుణులు చెబుతున్నారు.  

ఫిజిక్స్‌తో పరేషాన్‌ 
మూల సూత్రాలపై పట్టులేని విద్యార్థులను ఫిజిక్స్‌ ప్రశ్నలు ఇబ్బంది పెట్టాయి. కొన్ని ప్రశ్నలను ట్విస్ట్‌ చేసి ఇచ్చారు. కాన్సెప్ట్‌తో లోతైన అవగాహన ఉంటే తప్ప సమాధానం ఇవ్వలేని విధంగా ఉన్నాయి. రే ఆప్టిక్స్, గ్రావిటేషన్, సెమీ కండక్టర్స్, వేవ్‌ ఆప్షన్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్, మోడ్రన్‌ ఫిజిక్స్‌ చాప్టర్ల నుంచి వచ్చిన ప్రశ్నలు తికమక పెట్టే విధంగా ఉన్నాయని విద్యార్థులు చెప్పారు. సూత్రాలతోపాటు న్యూమరికల్‌ క్యాలుక్యులేషన్స్‌ ప్రశ్నలు ఇచ్చారు. 

సాధారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఇచ్చే గ్రాఫికల్‌ విశ్లేషణ మెయిన్స్‌లోనూ ఉండటం విద్యార్థులకు కష్టంగా ఉంది. రే డయాగ్రామ్స్, సైన్‌ కన్వెన్షన్స్, మ్యాగ్నిఫికేషన్, మిర్రర్‌ ఫార్ములా చాప్టర్స్‌ నుంచి వచ్చిన ప్రశ్నలకు ఐచ్చికాలు గుర్తించడం కొంత ఇబ్బందిగా అనిపించిందని విద్యార్థులు చెప్పారు. మోడ్రన్‌ ఫిజిక్స్‌ ప్రశ్నలు కాన్సెప్ట్‌ ఆధారంగా ఉన్నాయి. ఫొటో ఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్, థ్రిషోల్డ్‌ ఫ్రీక్వెన్సీ, గ్రాఫ్‌ బేస్డ్‌ ప్రశ్నలు ఈసారి కఠినంగా ఉన్నాయి. సెమీ కండక్టర్స్‌లో ట్రాన్స్‌సిస్టర్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ ప్రశ్నలు వచ్చాయి.  

మేథ్స్‌లో మైండ్‌ గేమ్‌ 
మేథ్స్‌లో సగం ప్రశ్నలు ఈజీగా ఉన్నాయనేది విద్యార్థుల అభిప్రాయం. మిగతా సగం మాత్రం మైండ్‌ గేమ్‌ ఆడినట్టు ఉన్నాయని తెలిపారు. చూడడానికి సాధారణంగా అనిపించినా, సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పారు. సుదీర్ఘ లెక్క చేస్తే తప్ప కచ్చితమైన సమాధానం రాబట్టలేని పరిస్థితి కనిపించింది. 

3 డీ జామెట్రీ–2, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినేట్స్, వెక్టర్‌ ఆల్‌జీబ్రా, ఇన్‌డెఫినేట్, డెఫినేట్‌ ఇంటిగ్రేషన్స్, ప్రాబబులిటీ, పెర్మ్‌ కాంబినేషన్స్, సీక్వెన్స్‌ సిరీస్, సర్కిల్స్, స్ట్రాటజిక్‌ లెన్స్, స్టాటిస్టిక్స్‌ ఎల్‌సీడీ, ఫంక్షన్స్‌ నుంచి వచ్చిన మేథ్స్‌ ప్రశ్నలు బహుళ ఐచ్చికాల ఆన్సర్స్‌లో గందరగోళానికి గురిచేశాయి. ఒకటికి రెండుసార్లు లెక్క చేస్తేనే కచ్చితమైన సమాధానం ఇవ్వగలిగామని విద్యార్థులు తెలిపారు.  

కాపాడిన కెమిస్ట్రీ 
చాలామంది విద్యార్థులు రసాయనశాస్త్రం నుంచి వచ్చిన ప్రశ్నలు తేలికగా ఉన్నాయని చెప్పారు. ఎక్కువ స్కోర్‌ కెమిస్ట్రీలోనే సాధ్యమన్నారు. ఈ విభాగంలో ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచే వచ్చాయి. కెమికల్‌ బాండింగ్, ఆటమిక్‌ స్ట్రక్చర్, పీరియాడిక్‌ టేబుల్, కో–ఆర్డినేట్‌ కాంపౌండ్స్, బేసిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, థియరీ డైనమిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగా సమాధానాలు ఇవ్వగలిగామని విద్యార్థులు తెలిపారు. పెద్దగా మూలకాల జోలికి వెళ్లకపోవడం విద్యార్థులకు తేలికైంది.  

కాన్సెప్ట్‌ ఉన్న వారికే ఈజీ  
సబ్జెక్టుపై పట్టు ఉన్నవారికే ఈసారి జేఈఈ మెయిన్స్‌ తేలికగా ఉందని చెప్పాలి. మొత్తంగా పేపర్‌ మధ్యస్థమని విశ్లేషించాలి. అయితే, ఫిజిక్స్‌ మాత్రం ఈసారి విద్యార్థులను ఆడుకుందనేది వాస్తవం. కెమిస్ట్రీలో టిపికల్‌ ప్రశ్నలు లేకపోవడం విశేషం. లోతుగా సబ్జెక్టును విశ్లేషించే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ నుంచి ప్రశ్నలు రావడం వల్ల బట్టీతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు గందరగోళానికి గురయ్యే వీలుంది.   – ఎంఎన్‌రావు, జేఈఈ శిక్షణ నిపుణుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement