కాలగర్భంలో కలసిపోనున్న నిజాం కాలం నాటి నిర్మాణం
పూర్తిగా నేలమట్టమయ్యేలా 17.6 మీటర్ల మేర మార్కింగ్
రసూల్‌పురా–పాటిగడ్డ– నెక్లెస్‌రోడ్డు ఫ్లైఓవర్ పనులు
రోడ్డు విస్తరణలో కనుమరుగు కానున్న వారసత్వ కట్టడం
అది 1892 నాటి దేవడి నజీర్ నవాజ్ జంగ్ ప్యాలెస్.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) జాబితాలో గ్రేడ్–3 హెరిటేజ్ బిల్డింగ్‌గా నమోదై ఉంది. అంతేకాదు.. దక్కన్ స్టైల్ ఆర్కిటెక్చర్‌లో నిర్మించిన ఈ ప్యాలెస్‌కు 1996లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్‌టాక్) నుంచి అవార్డు కూడా లభించింది. ప్యాలెస్‌కు ప్రవేశ ద్వారంగా తూర్పు వైపు ఉన్న పాత బురుజు ఇప్పుడు కాలగర్భంలో కలసిపోనుంది. ఒకప్పుడు బేగంపేటలో నిజాం కాలం నాటి బురుజు ఒకటి ఉండేదని భవిష్యత్ తరాలు ఇక చరిత్ర పుటల్లోనే చదువుకోవాలి. ఎందుకంటే.. ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణలో ఈ బురుజు కథ ముగిసిపోనుంది. కోట ప్రాకారంపై ఉండే పహారా టవర్ (బురుజు) కనుమరుగవుతుండడంతో వికార్ ఉల్ ఉమ్రా సంతతికి చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని దేశాలు తమ వారసత్వ కట్టడాలను కాపాడుకుంటుంటే.. ఇక్కడ మాత్రం వాటి ఆనవాళ్లను చెరిపేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో ఇర్రంమంజిల్ కూల్చివేతపై ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఇక్కడి 1680.18 ఎకరాల్లో భాగంగా దేవడి నజీర్ నవాజ్ జంగ్ ప్యాలెస్ కూడా ఉంది. ఐదో నిజాం కుమార్తె జహందరున్నీసాబేగంను వికార్ ఉల్ ఉమ్రాకు వివాహం చేశారు. వికార్ ఉల్ ఉమ్రా సంతతికి చెందిన వారే ఇక్కడ ఉంటూ వచ్చారు. ఈ ప్యాలెస్‌కు తూర్పు వైపు ఉన్న పాత కాలం నాటి బురుజుపై 17.6 మీటర్లను సూచిస్తూ మార్కింగ్ చేశారు. అంటే 50 అడుగుల పైగా ఇక్కడి స్థలం రోడ్డు విస్తరణలో కోల్పోతుందన్న మాట. ఈ నేపథ్యంలో వారు సూచించిన కొలతల ఆధారంగా స్వా«దీన ప్రక్రియ జరిగిందంటే ప్యాలెస్‌కు ప్రవేశద్వారంగా ఉన్న బురుజు పూర్తిగా కూల్చివేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అసలు ప్రాజెక్టు ఉద్దేశమేమిటంటే..
⇒ హైదరాబాద్– సికింద్రాబాద్‌ల మధ్య రాకపోకలు మరింత సులువు చేసేందుకు.. రసూల్‌పురా జంక్షన్ నుంచి వయా పాటిగడ్డ, సంజీవయ్య పార్కు రైల్వేస్టేషన్ మీదుగా నెక్లెస్‌రోడ్డుకు ఫ్లైఓవర్ నిర్మాణానికి 2007లో ప్రతిపాదించారు. బేగంపేట, రాణిగంజ్, సోమాజిగూడ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని అధికారులు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన పుష్కరంన్నర కాలం తర్వాత ఎట్టకేలకు పట్టాలెక్కించే పనిలో పడ్డారు. రసూల్‌పురా వద్ద ప్రారంభమయ్యే ఎలివేటెడ్ కారిడార్ పాటిగడ్డ మీదుగా వెళ్లి సంజీవయ్య పార్కు ఎంఎంటీఎస్ స్టేషన్ పైగా చివరకు నెక్లెస్‌రోడ్డుకు కలిసే ఈ మార్గంలో ఫ్లైఓవర్ నిర్మాణ క్రమంలో రోడ్డును భారీగా విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం కేవలం 60 (30 ప్లస్ 30) ఫీట్లు మాత్రమే ఉండగా దానిని 120 ఫీట్లకు విస్తరించనున్నారు.
⇒ ఈ క్రమంలో పాతకాలం నాటి బురుజు వద్ద 17.6 మీటర్లు, అది దాటిన తర్వాత వచ్చే మూల మలుపు తిరగ్గానే అత్యధికంగా 20.2 మీటర్ల మేర స్థలాన్ని ఈ రోడ్డు వెడల్పులో స్వా«దీనం చేసుకోవాలని అధికారులు మార్కింగ్‌లు చేశారు. ఇలా అత్యల్పంగా 9 మీటర్ల నుంచి అత్యధికంగా 20.2 మీటర్ల మేర మార్కింగ్‌లు చేశారు. ఇందులో నిజాం కాలం నాటి బురుజుతో పాటు సంజీవయ్య పార్కు ఎంఎంటీఎస్ స్టేషన్ ముందు భాగం కూడా 13.3 మీటర్ల మేర స్వా«దీనం చేసుకోనున్నారు. ఈ మార్గంలోని ఇళ్లు కూడా ప్రభావితం కానున్నాయి. రోడ్డుకు కుడివైపు 36 ఆస్తులు, ఎడమ వైపు 11 ఆస్తులను స్వాధీనం చేసుకునే క్రమంలో మార్కింగ్ చేశారు. వారసత్వ కట్టడాలకు ఎలాంటి హాని చేయకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించవచ్చని వికార్ ఉల్ ఉమ్రా సంతతికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.


