దేవాదుల పంపింగ్‌ యూనిట్లు స్టార్ట్‌ | Devadala pumping units start 9 pumping units to be operational | Sakshi
Sakshi News home page

దేవాదుల పంపింగ్‌ యూనిట్లు స్టార్ట్‌

Jul 22 2026 3:47 AM | Updated on Jul 22 2026 3:47 AM

Devadala pumping units start 9 pumping units to be operational

 పూర్తి సామర్థ్యంతో పనిచేయనున్న 9 పంపింగ్‌ యూనిట్లు 

గోదావరి నీటితో 22 రిజర్వాయర్లను నింపడమే లక్ష్యం: ఉత్తమ్‌

తాగు, సాగునీటి భద్రతకే తొలి ప్రాధాన్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారంరాత్రి నుంచే దేవాదుల ప్రాజెక్టుకు చెందిన 9 పంపింగ్‌ యూనిట్లను 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో నడపనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. గోదావరి నదిలో అందుబాటులో ఉన్న నీటిని సాధ్యమైనంత ఎక్కువగా ఎత్తిపోసి దేవాదుల పరిధిలోని 9 జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సచివాలయంలో మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి వెల్లడించారు. 

ఇటీవల దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, పంపింగ్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చూడడంతో పాటు రైతులకు అవసరమైన సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 

అందుకే దేవాదుల పంపులను 24 గంటలు నిరంతరాయంగా నడిపే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గోదావరి నుంచి ఎత్తిపోసే నీటిని వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లోని రిజర్వాయర్లకు చేరేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రిజర్వాయర్లు నిండితే సాగునీటితోపాటు తాగునీటి సమస్య కూడా చాలా వరకు పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టుపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు.  

కాళేశ్వరం నిర్ణయాలపై సమాధానం చెప్పాలి 
దేవాదుల ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న నిర్ణయాలపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్‌ పైల్‌ ఫౌండేషన్‌ డిజైన్‌ను మార్చి సెకెంట్‌ పైల్‌ ఫౌండేషన్‌ను ఎందుకు అమలు చేశారో వివరించాలని ప్రశ్నించారు. ఆ నిర్ణయాల వల్లే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలను కూడా మంత్రి ప్రస్తావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి బీఆర్‌ఎస్‌కు రూ.1,400 కోట్లు వెళ్లాయని కవిత చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకం మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, భూసేకరణ, అటవీ అనుమతులు, ఇతర పరిపాలనా అనుమతులు, నిర్మాణ పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం అని చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement