2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు | Sakshi
Sakshi News home page

2032–33 నాటికి కట్టాల్సింది.. రూ.2.5 లక్షల కోట్లు

Published Fri, Feb 16 2024 2:01 AM

Debt ratio increased to increased to 37 percent above compared to GSDP: Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై అప్పుల భారం తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో రుణాల తిరిగి చెల్లింపు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ‘కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’నివేదికలో పేర్కొంది. మార్కెట్‌ రుణాల మీద వడ్డీ, అసలు కలిపి.. 2032–33 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 2022 మార్చి 31తో ముగిసిన (2021–22) ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిర్వహణ తీరుపై కాగ్‌ రూపొందించిన ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ముందుపెట్టింది.

బడ్జెట్‌లో పేర్కొనకుండా తీసుకున్న రుణాల్లో (ఆఫ్‌ బడ్జెట్‌) కాళేశ్వరానికే ఎక్కువగా ఉన్నాయని కాగ్‌ పేర్కొంది. ‘కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)’కింద రూ.66,854 కోట్లు తీసుకున్నారని.. ఈ రుణాల అసలు, వడ్డీ కలిపి 14 ఏళ్లలో రూ.1,45,545 కోట్లు చెల్లించాలని పేర్కొంది. దీనితో సమీప భవిష్యత్తులో అభివృద్ధి ప్రణాళికల విషయంలో రాష్ట్ర సామర్థ్యం పరిమితం అవుతుందని వ్యాఖ్యానించింది. 

కాగ్‌ నివేదికలోని అంశాలివీ.. 
► రెవెన్యూ రాబడులు 26 శాతం పెరిగినా మిగులును సాధించడంలో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది కూడా విఫలమైంది. బడ్జెట్‌ నుంచి చెల్లిస్తున్న ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలు, ఇతర చెల్లింపులను కలిపితే.. జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి 37.77 శాతంగా ఉంది. ఇది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన దానికంటే 12.77 శాతం, 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దానికంటే 8.47 శాతం ఎక్కువ. 

►2021–22లో రెవెన్యూ వ్యయం 11 శాతం పెరిగింది. ఇందులో జీతాలు, వడ్డీ చెల్లింపులే ఎక్కువ భాగం ఉన్నాయి. విద్య, ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలో ఉంది. మొత్తం వ్యయంలో 8శాతం విద్య, 4శాతం ఆరోగ్యంపై ఖర్చు చేశారు. 

► అంతకుముందు ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 81శాతం పెరిగింది. 2021–22లో రూ.28,874 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చుపెట్టారు. అయితే 2022 నాటికి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.1,09,612 కోట్లు మూలధనం ఖర్చయింది. 

► బడ్జెట్‌ వ్యయం కింద రూ.2,30,872 కోట్లకు ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకుంది. తర్వాత అనుబంధంగా రూ.24,144 కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ ఖర్చు రూ.2,63,092 కోట్లుకాగా.. నికర అధిక వ్యయం రూ.8,076 కోట్లు. వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సులను పరిగణనలోకి తీసుకోకపోతే అయిన ఖర్చు రూ.1,95,818 కోట్లే. అంటే బడ్జెట్‌ అంచనాల్లో వాస్తవఖర్చు 77శాతమే. 

► 2014–15 నుంచి 2020–21 వరకు కలిపి బడ్జెట్లకు అదనంగా చేసిన రూ.2,14,062 కోట్ల ఖర్చుకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంది. ఇది ప్రజావనరుల నిర్వహణలో క్రమశిక్షణ రాహిత్యమే. 

► దళితబంధు కోసం రూ.1,000 కోట్లు కేటాయించారు. కానీ వినియోగ పద్దులో రూ.4,442 కోట్లు ఖర్చు చూపెట్టారు. వాస్తవంగా ఖర్చయినది రూ.2,101 కోట్లు మాత్రమే.

అనర్హులకు ‘ఆసరా’తో రూ.1,175 కోట్లు నష్టం
అర్హతలేని 2.02 లక్షల మందికి లబ్ధి కలిగిందన్న కాగ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద అనర్హులకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. పంచాయతీరాజ్‌–గ్రామీణాభివృద్ధి శాఖ కొందరు లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినా కూడా వారిని జాబితా నుంచి తొలగించారని తెలిపింది. దీనితో 2021 మార్చి 31తో ముగిసిన (2020–21) ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షల మంది అనర్హులకు రూ.1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగినట్టు తేల్చింది. కుటుంబ ఆదాయానికి సంబంధించిన సిస్టమ్‌లో అంతర్గతంగా కచ్చితమైన నియంత్రణలు లేవని.. దీనితో నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ ఆదాయమున్నవారికీ లబ్ధి కలిగిందని తెలిపింది.

సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కేఎస్‌) డేటాలోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని 16శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లకు అర్హత లేదని స్పష్టమవుతోందని, అయినా పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన, మంజూరు, గుర్తింపు ప్రక్రియలను సమర్థవంతంగా చేయలేదని తప్పుపట్టింది. 2018 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి మధ్య సగటున నెలకు 2.30 లక్షల (6 శాతం) మంది లబ్ధిదారులకు పింఛన్ల చెల్లింపు జరగలేదని పేర్కొంది.  

ఇసుక విధానంలో లోపాలతో ఖజానాకు గండి
ఇసుక వెలికితీతలో టీఎస్‌ఎండీసీ తీరును తప్పుపట్టిన కాగ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇసుక విధానంలోని లోపాలతో, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) తీరుతో ఖజానాకు నష్టం వాటిల్లిందని ‘కాగ్‌’పేర్కొంది. టీఎస్‌ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్న గిరిజన సంఘాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలను సబ్‌ లీజ్‌కు అప్పగించడంతో.. థర్డ్‌ పార్టీకి రూ.11.61 కోట్లు అనుచిత లబ్ధి జరిగిందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఇసుక కాంట్రాక్టర్లకు చెల్లించే ధర నిర్ణయంలో ఆలస్యంతో రూ.172.64 కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయిందని పేర్కొంది.

అధిక లోడింగ్, వాహనాల కదలికలను గుర్తించే సీసీ కెమెరాలు, జీపీఎస్‌ పరికరాలను అరకొరగా ఏర్పాటు చేయడం సరికాదని తెలిపింది. ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల కార్యకలాపాలపై టీఎస్‌ఎండీసీ పర్యవేక్షణ లోపభూయిష్టమని పేర్కొంది. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలతో 2022 మార్చి నాటికి రూ.108.96 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని కాగ్‌ తెలిపింది. 2016–21 మధ్య రూ.171.32 కోట్లు రహదారి చార్జీలు వసూలైతే.. అందులో ప్రభుత్వం రూ.162.27 కోట్లను ఇతర ప్రయోజనాలకు మళ్లించిందని పేర్కొంది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement