రేపటి నుంచి అమల్లోకి.. | The date for revision of land values ​​in the state has been finalized | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి అమల్లోకి..

Jun 4 2026 3:56 AM | Updated on Jun 4 2026 3:58 AM

The date for revision of land values ​​in the state has been finalized

రాష్ట్రంలో భూములవిలువల సవరణకు ముహూర్తం ఖరారు

అధికారికంగాప్రకటించిన ప్రభుత్వం..

పాత విలువలునేడు ఒక్కరోజే వర్తింపు 

నేడు కూడా ఉ. 9:30 నుంచి రాత్రి 7:30 వరకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు 

వ్యవసాయ భూమి కనిష్ట ధర రూ.2.75 లక్షలు.. గరిష్ట ధర 30 కోట్లు 

‘క్యూర్‌’ లో చదరపు గజం కనిష్టంగా రూ.3 వేలు, చదరపు అడుగు రూ.2 వేలు 

మున్సిపాలిటీల్లో చదరపు గజంకనిష్టంగా రూ.1,500,చదరపు అడుగు రూ.1,000 

ప్రజలకు ఇబ్బంది లేకుండా వాస్తవ మార్కెట్‌ ధరల ఆధారంగా విలువలు నిర్ధారించాం: మంత్రి పొంగులేటి 
 

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు రాష్ట్రంలోని భూముల విలువల సవరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన రిజిస్ట్రేషన్  విలువలు అమల్లోకి వస్తాయ ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ విలువల సవరణ కనిష్టంగా 15 శాతం, గరిష్టంగా 100 శాతం ఉంటుందని తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో భూములు, ఆస్తులకున్న విలువల ఆధారంగా ప్రస్తుత బేసిక్‌ రిజిస్టర్‌ విలువలను సరిచూసుకొని కొత్త విలువలను ప్రతిపాదించారు. 

వ్యవసాయ భూమి కనీస ధర రూ.2.75 లక్షలు, గరిష్ట ధర రూ.30 కోట్లుగా నిర్ణయించినట్టు సమాచారం. ఎక్కడ ఎంత పెంచారనే వివరాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గురువారం అధికారికంగా వెల్లడించనుంది. విశ్వసనీయ సమా చారం ప్రకారం.. క్యూర్‌ పరిధిలో చదరపు అడుగు కనిష్ట ధర రూ.3 వేలు, చదరపు గజం రూ.2 వేలు, వ్యవసాయ భూమి రూ.15 లక్షలుగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. పాత హెచ్‌ఎండీఏ పరిధిలో చదరపు అడుగు రూ.2 వేలు, చదరపు గజం రూ.1,500, వ్యవసాయ భూమి 10 లక్షలుగా, మున్సిపాలిటీల్లో చదరపు గజం రూ.1,500, చదరపు అడుగు రూ.1,000, వ్యవసాయ భూమి విలువ కనిష్టంగా ఎకరానికి రూ.5 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. 

ఇక, రాష్ట్రమంతా కలిపి కనిష్టంగా వ్యవసాయ భూమి రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. ఇక, గరిష్టంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఖాజాగూడలో ఓ సర్వేనంబరులోని వ్యవసాయ భూమి ఎకరాకు  గతంలో రూ. 24 కోట్లు ఉండగా, గరిష్టంగా దానిని రూ.30 కోట్లకు పెంచినట్టు సమాచారం. అయితే ఈ ప్రాంతంలోనే భూమి గరిష్ట విలువ 32 కోట్లు ఉన్నా, దానిని పెంచలేదని సమాచారం. విలువల సవరణపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ 15–100 శాతం విలువలను పెంచామని, కొన్నిచోట్ల అసలు పెంచలేదని, రేడియల్‌ రోడ్లు, ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల 100 శాతం పెంచగా, ఎక్కువ ప్రాంతాల్లో 15–75 శాతానికి పెంచుతున్నట్టు వెల్లడించారు. 

కాగా, రిజిస్ట్రేషన్‌ ఫీజులో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ఈ విలువల సవరణ ద్వారా ఏడాదికి రూ.1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి కొత్త విలువలు అమల్లోకి రానున్న నేపథ్యంలో గురువారం ఒక్క రోజే పాత విలువలు అమల్లో ఉంటాయి కాబట్టి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉద యం 9:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటలవరకు పనిచేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు రిజిస్ట్రేషన్  శాఖ అధికారులను ఆదేశించారు.

రేవంత్‌ ఆలోచన.. అరవింద్‌ నివేదిక ఆధారంగా
రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 5వ తేదీ నుంచి భూముల విలువలను సవరిస్తున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన, ఆర్థికనిపుణుడు అరవింద్‌ సుబ్రమణియం ఇచ్చిన నివేదికల ఆధారంగా ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడంతోపాటు విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా మని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

‘బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం సమగ్ర కసరత్తు లేకుండానే అశాస్త్రీయ పద్ధతుల్లో 2021–22 సంవత్సరంలో కేవలం 6 నెలల వ్యవధిలోనే రెండుసార్లు భూముల విలువలను పెంచింది. ఈ భారీ అంతరం కారణంగా భూలావా దేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకే 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో విలువల సవరణ చేపట్టాం. ఈ నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి, భూలావాదేవీల్లో పారదర్శ కతతో పాటు ప్రభుత్వ వృద్ధికి దోహదపడనుంది’అని ఆ ప్రకటనలో పొంగులేటి వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement