
సమావేశంలో మాట్లాడుతున్న పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. చిత్రంలో వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున
ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
రెండు రకాలుగా ముఠాల దందా
డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల హ్యాకింగ్
థియేటర్లలో చిన్న కెమెరాల ద్వారా రికార్డింగ్
వ్యవస్థీకృతంగా సాగుతున్న దందా
పైరసీతో రూ.22,400 కోట్ల నష్టం: నగర పోలీస్ కమిషనర్ ఆనంద్
సినీ ప్రముఖులతో ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. పైరసీకి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ వ్యవహారం జరుగుతున్న విధానం, మార్కె టింగ్, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లలో 1,050 సినిమాలను పైరసీ చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ప్రకటించారు. వీరిలో ఓ నిందితుడు మూడేళ్లలో 550 సినిమాలు పైరసీ చేయగా... నలుగురితో కూడిన ముఠా ఐదేళ్లలో 500 సినిమాలు చేసినట్లు గుర్తించామన్నారు. ఈ పైరసీతో చిత్ర పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ మేరకు ఫిల్మ్ డెవల్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి సీవీ ఆనంద్ తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు.
ఈ అశ్వని కుమార్ మామూలోడు కాదు...
బిహార్‌కు చెందిన అశ్వినీ కుమార్ పదో తరగతి వరకు చదివాడు. ఆన్‌లైన్ ద్వారానే హ్యాకింగ్ నేర్చుకున్న ఇతగాడి దృష్టి సినిమా పైరసీపై పడింది. విడుదలకు సిద్ధమైన చిత్రాన్ని నిర్మాతలు కొన్ని డిజిటల్ మీడియా సంస్థలకు అందిస్తారు. దాన్ని తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకునే ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఆయా థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపిస్తాయి. ఇలాంటి సంస్థలపై కన్నేసిన అశ్వినీ కుమార్ వాటి సర్వర్లను హ్యాక్ చేసి, విడుదలకు సిద్ధంగా ఉన్న, తాజాగా విడుదలైన చిత్రాలను తస్కరిస్తాడు. మూడేళ్లలో వివిధ భాషలకు చెందిన 550 సినిమాలను పైరసీ చేసి కొన్నింటిని విడుదలకు వారం రోజుల ముందే తస్కరించాడు. ఇలాంటి వాటిలో పుష్ప–2 కూడా ఉంది. పైరసీ ద్వారా లక్ష డాలర్లు (సుమారు రూ.88 లక్షలు) ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. పటా్నలోని సంపత్ చక్‌లో ఇతడి ఇల్లు 80 గజాల్లో ఉంటుంది. ఈ ఇంటి చుట్టూ ఏకంగా 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు.
బెట్టింగ్ యాప్స్‌తో ఒప్పందాలు చేసుకుని...
పైరసీ చేసిన సినిమాలను మార్కెటింగ్ చేసుకోవడానికి అశ్వినీ కుమార్ వివిధ టెలిగ్రాం చానల్స్ అడ్మిన్లతోపాటు గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వీరి నుంచి ఒక్కో చిత్రానికి 10 వేల నుంచి 25 వేల డాలర్ల వరకు వసూలు చేస్తున్నాడు. టెలిగ్రాం చానల్స్‌లో నేరుగా సినిమా లింకు పెడుతుండగా... వెబ్‌సైట్స్‌లో యాడ్స్ రూపంలో ఈ లింకు ఇస్తున్నారు. పగటి పూట నిద్రపోయి, రాత్రి వేళల్లో మేల్కొనే ఇతడు తన హ్యాకింగ్ సత్తాను పరీక్షించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు బిహార్, జార్ఖండ్‌కు చెందిన వివిధ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సర్వర్లను హ్యాక్ చేశాడు. దీనికోసం నెదర్లాండ్స్‌కు చెందిన ఐపీ అడ్రస్ వినియోగించాడు. ఇతడు చిత్రాలను నేరుగా సర్వర్ల నుంచి పైరసీ చేస్తుండటంతో అవన్నీ హెచ్‌డీ ప్రింట్‌తో ఉంటున్నాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన క్రిప్టో కరెన్సీ ఇతగాడికి అషి్మత్ సింగ్ ద్వారా చేరినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడి హ్యాకింగ్ టాలెంట్ చూసి అవాక్కైన సీవీ ఆనంద్ నెలకు రూ.10 లక్షల జీతం ఇచ్చి అతడి సేవలు వినియోగించుకోచ్చన్నారు.
క్యామ్ కార్డర్‌తో థియేటర్లలో...
తమిళనాడుకు చెందిన సిరిల్ ఇన్ఫంట్ రాజ్ అమలదాస్ క్యామ్ కార్డర్ ద్వారా థియేటర్లలో సినిమాలు రికార్డు చేసి పైరసీ చేస్తున్నాడు. దీనికోసం వనస్థలిపురంలో ఉంటున్న జాన కిరణ్ కుమార్, తమిళనాడుకే చెందిన సుధాకరన్, గోవాకు చెందిన అర్సలాస్ అహ్మద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. పైరసీ సినిమాలను హోస్ట్ చేయడానికి అమలదాస్ రెండు సర్వర్లను ఖరీదు చేశాడు. కిరణ్ కుమార్ మిగిలిన ఇద్దరితో కలిసి సినిమా విడుదలైన రోజు థియేటర్లలో మధ్యలో ఉండే వరుసల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటాడు. తమతోపాటు చుట్టు పక్కల ఉన్న సీట్లను బుక్ చేస్తాడు.
క్యామ్ కార్డర్లు లేదా సెల్‌ఫోన్‌లో ప్రత్యేక క్యామ్ కార్డర్ యాప్‌ల సహకారంతో వీరు సినిమా రికార్డు చేస్తారు. ఈ ప్రింట్‌ను అమలదాస్ కొన్ని టోరెంట్స్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలో హోస్టు చేస్తున్నాడు. వారి నుంచి ఒక్కో సినిమాకు 3 వేల డాలర్ల వరకు వసూలు చేస్తూ అనుచరులకు వాటా ఇస్తున్నాడు. వీళ్లు ఐదేళ్లలో 500 సినిమాలు పైరసీ చేయగా... కొన్నింటిని హైదరాబాద్‌లోని థియేటర్లలో రికార్డు చేశారు. ఇలా ఇప్పటివరకు రూ.2 కోట్లు సంపాదించారు. హిట్, సింగిల్, కుబేర, హరి హర వీరమల్లు చిత్రాల పైరసీపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఐదుగురినీ అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
సినీ ప్రముఖులతో సీపీ భేటీ
సినిమా పైరసీ పూర్వాపరాలు, నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని వివరించడానికి హైదరాబాద్ పోలీసులు సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హాజరయ్యారు. సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ భాగస్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పోలీసులు వివరించారు. క్యామ్ కార్డర్ పైరసీని నిరోధించడానికి థియేటర్లలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. థియేటర్ యజమానులు నిఘా పెంచాలని కోరారు. పైరసీ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యహరించిన ఏసీపీ ఆర్‌జీ శివమారుతితోపాటు ఇన్‌స్పెక్టర్లు ఎస్.నరేష్, సతీష్‌రెడ్డి, ఎన్.దిలీప్ కుమార్, కె.మధుసూదన్ రావులను అభినందించారు.