ఫేస్‌‘బుక్కై’పోయాడు! | Customs fraud case In hyderabadi | Sakshi
Sakshi News home page

ఫేస్‌‘బుక్కై’పోయాడు!

Apr 22 2025 8:39 AM | Updated on Apr 22 2025 8:39 AM

Customs fraud case In hyderabadi

ఫేస్‌బుక్‌ ద్వారా నగరవాసికి నేరగాడి ఎర 

అమెరికాలో సర్జన్‌గా పరిచయం 

డాలర్లు తెస్తూ కస్టమ్స్‌కు చిక్కానని ఫోన్‌ 

ట్యాక్స్‌ పేరుతో రూ.1.55 లక్షలు స్వాహా  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో సుదీర్ఘ కాలం తర్వాత మరో కస్టమ్స్‌ ఫ్రాడ్‌ కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన నేరగాడు కస్టమ్స్‌ అధికారుల పేరు చెప్పి రూ.1.55 లక్షలు కాజేశాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగికి దాదాపు రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. 

అమెరికాలో ఉంటున్న సర్జన్‌ హెన్రీ రాబర్ట్‌ అంటూ ప్రొఫైల్‌ ఉండటంతో నగరవాసి యాక్సప్ట్‌ చేశాడు. ఆపై వాట్సాప్‌ కాల్స్‌ చేసిన రాబర్ట్‌ నగరవాసితో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. తాను త్వరలోనే భారత్‌కు వస్తున్నానని, హైదరాబాద్‌ వచ్చి కలుస్తానని చెప్పాడు. పూర్తిగా నమ్మించేందుకు డమ్మీ ఫ్లైట్‌ టిక్కెట్స్‌ ఫొటోలను పంపాడు. కొన్ని రోజులకు బాధితుడికి కాల్‌ చేసిన రాబర్ట్‌ తాను ముంబై విమానాశ్రయంలో దిగానని, తన వద్ద లెక్కలు చెప్పని 1.2 లక్షల డాలర్లు ఉన్నాయని నమ్మించాడు. 

దీంతో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారన్న రాబర్ట్‌ పన్ను చెల్లించకపోతే నగదుతో పాటు తన లగేజీ సైతం జప్తు చేస్తారని చెప్పాడు. ఆపై ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారిగా మాట్లాడిన మరో వ్యక్తి రాబర్ట్‌ రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని చెప్పాడు. తాను బయటకు వచ్చాక ఆ మొత్తం ఇచ్చేస్తాంటూ రాబర్ట్‌ చెప్పంతో నమ్మిన నగర వాసి ఆ మొత్తం వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. 

ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌లో నిందితుడి అరెస్టు... 
నగరానికి చెందిన బాధితుడి (68) నుంచి  ఏళ్ల బాధితుడి నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో రూ.52,29,500 కాజేసిన కేసులో ఓ నిందితుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌మీడియా ద్వారా బాధితుడికి ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు 5పైసా క్యాపిటల్‌ లిమిటెడ్, బార్‌క్లేస్, షాండా క్యాపిటల్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ల్లో పెట్టుబడుల పేరు చెప్పారు. ఓ టెలిగ్రాం గ్రూపులో సభ్యుడిగా చేర్చి ప్రియా అగర్వాల్, గౌరవ్‌ ముంజాల్‌ పేర్లతో ఇరువురు సలహాలు సూచనలు ఇచ్చారు. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ నిండా ముంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన ప్రతీఖ్‌ శుక్లాను అరెస్టు చేశారు. అతడిపై దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నట్లు గుర్తించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement