
సీపీఐ నేత చందు రాథోడ్ దారుణ హత్య..
అతి సమీపం నుంచి కాల్పులు.. అక్కడికక్కడే కుప్పకూలిన వైనం
హైదరాబాద్‌లో ఘటన
హత్యలో నలుగురు పాల్గొన్నట్లు ఆధారాలు
రంగంలోకి దిగిన పది ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్/మలక్‌పేట: సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ మలక్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి.
ఈ హత్యలో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు.. పరోక్షంగా సహకరించిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, హతుడి కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
వసూళ్లు అడ్డుకోవడంతో వివాదాలు
నాగర్‌కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్‌సుఖ్‌నగర్ సమీపంలోని విద్యుత్‌నగర్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా... సింధు గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్‌ఎఫ్‌ఐలో, కారి్మక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్‌లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు.
2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్ తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్‌లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
వాకింగ్ చేసిన పార్కు బయటే...
రాజేశ్‌తోపాటు మరికొందరు సోమవారం రాత్రి కారులో చందు ఇంటి సమీపంలో సంచరించడాన్ని నారీబాయి గమనించి చందును హెచ్చరించారు. మంగళవారం ఉదయం భార్య, కుమార్తెతో కలిసి చందు శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేశారు. 7.30 గంటల ప్రాంతంలో బయటకు రాగా.. అక్కడే కారులో రాజేష్ కనిపించడంతో నారీబాయి హెచ్చరించారు. ‘నాకేం కాదు. ఏం భయం లేదు. మీరు ఇంటికి వెళ్లండి’అంటూ భార్య, కుమార్తెను పంపేశాడు.
పార్కు వెస్ట్ గేట్ నుంచి కుడి వైపు రోడ్డులో కారు వద్దకు వెళ్తుండగా అందులోంచి దిగిన ఇద్దరు చందు కళ్లలో కారం కొట్టారు. అప్రమత్తమైన ఆయన తప్పించుకోవడానికి వెనక్కు పరిగెత్తగా.. పార్కు గేటు వద్ద ఉన్న ఇసుకలో కాలు జారి పడిపోయారు. సమీపంలోకి వచ్చిన ఇద్దరు పిస్టల్‌తో అతని ఛాతీ, పొట్ట భాగాల్లో కాల్చారు. రక్తం మడుగులో ఉన్న అతడిని కాలుతో వెనక్కు తిప్పి తలపై మరో రౌండ్ కాల్చి కారులో పారిపోయారు.
సెల్ఫ్ డ్రైవింగ్ కారు అద్దెకు తీసుకుని...
ఘటనాస్థలి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ (టీఎస్ 08 హెచ్‌డబ్ల్యూ 0875) కారులో వచి్చనట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. సోమవారం ఆన్‌లైన్‌లో ఆ కారును బుక్ చేసుకున్న ఏడుకొండలు అనే వ్యక్తి తీసుకుని వెళ్లారు.
అతడితోపాటు రాజేష్ , ప్రశాంత్, మరొకరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు కారు తీసుకెళ్లి అద్దెకు ఇచ్చిన సంస్థకు అప్పగించి పారిపోయారు. క్లూస్ టీమ్ ఘటనాస్థలిలో మూడు ఖాళీ క్యాట్రిడ్జ్‌లు, రెండు పేలని తూటాలను స్వాధీనం చేసుకుంది. పేలింది నాటు తుపాకీ అని, తూటాలు 7.65 ఎంఎం క్యాలిబర్‌కు చెందినవిగా తేల్చారు.
భానుచందర్ హత్య కేసులో నిందితుడు...
చందు 2022లో జరిగిన రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిర భానుచందర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. భూ వివాదాల నేపథ్యంలో నాగోలుకు చెందిన భాను చందర్‌ను, మన్సూరాబాద్‌కు చెందిన సీపీఐ నాయకుడు కందుల సుధాకర్, చందు తదితరులు ఆ ఏడాది ఏప్రిల్ 16న కిడ్నాప్ చేశారు. యాదాద్రి జిల్లా తిరుమలగిరి వద్ద అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీపంలో పడేశారు. ఈ కేసులో పోలీసులు చందుతోపాటు మిగిలిన నిందితులను అరెస్టు చేశారు.
రంగంలోకి పది ప్రత్యేక బృందాలు
హత్య విషయం తెలిసిన వెంటనే సౌత్‌ఈస్ట్ డీసీపీ ఎస్.చైతన్యకుమార్, అదనపు డీసీపీ కె.శ్రీకాంత్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు ఘటనాస్థలికి వచ్చారు. సీపీఐ నాయకులు అజీజ్‌పాషా, ఈటీ నర్సింహా, ఛాయాదేవి తదితరులు ఘటనాస్థలికి తరలివచ్చారు. చందు భార్య, కుమార్తె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరయ్యారు. ఏడాదిన్నర నుంచి చందుకు ప్రాణహాని ఉందని రాజేష్ తదితరులే చంపారని ఆమె ఆరోపించారు. చందు మృతితో నాగర్‌కర్నూల్ జిల్లాలోని స్వగ్రామం నర్సాయిపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.
చందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ చెప్పారు. మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెంటల్ ఏజెన్సీ నుంచి నిందితులు వాడిన కారును స్వా«దీనం చేసుకున్నారు.