ఒక్కో శవానికి రూ. 25 వేల నుంచి  రూ.40 వేల వరకు చెల్లింపు! | Covid 19 People Deceased Of Virus Cant Get Proper Funeral By Families | Sakshi
Sakshi News home page

‘ఆ నలుగురు’ ఏరి?.. డబ్బులిచ్చి మరీ అంత్యక్రియలు!

Apr 26 2021 8:09 AM | Updated on Apr 26 2021 10:01 AM

Covid 19 People Deceased Of Virus Cant Get Proper Funeral By Families - Sakshi

అంత్యక్రియలు నిర్వహించడం ఒక విధంగా మంచి కార్యక్రమే. కానీ, ఇది ఇలాగే కొనసాగితే వ్యాపారంగా మారే ప్రమాదముంది.

ఆయన కరీంనగర్‌లో ఓ టీచర్‌. బతికినంత కాలం ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎంతోమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. కొద్దిరోజుల క్రితం కోవిడ్‌ కారణంగా మరణించారు. కన్నకొడుకు కూడా ఆయన అంత్యక్రియలు నిర్వహించలేక అంబులెన్స్‌కి రూ.25 వేలిచ్చి తంతు జరిపించాడు.

హైదరాబాద్‌లో నివసించే ఓ వృద్ధురాలికి ఆరుగురు కుమారులు. కరోనా సోకి మరణించింది. కొడుకులంతా కోటీశ్వరులే. ఇంట్లో అందరూ షుగర్‌ వ్యాధిగ్రస్తులు. దీంతో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌కు రూ.30 వేలు ఇచ్చి దహన సంస్కారాల బాధ్యతలను అప్పగించారు. 

సాక్షి, హైదరాబాద్‌:  ఏ మనిషి మరణించినా.. పిల్లలు, బంధువులు, బలగాలు, స్నేహితులు అంతా తోడు రాగా.. జరగాల్సిన అంత్యక్రియలు ఒంటరిగానే జరుగుతున్నాయి. ఉన్నోడా.. లేనోడా.. అనే విషయం పక్కనబెడితే.. కరోనాతో మరణించిన వ్యక్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పుట్టి పెరిగిన ఊర్లోనే ‘ఆ నలుగురు’ వెంటరాగా నిర్వహించాల్సిన దహన సంస్కారాలు, గుట్టుచప్పుడు కాకుండా అనాథ శవాల్లా, అర్ధరాత్రి పూట కానిచ్చేస్తున్నారు. అది కూడా కుటుంబ సభ్యుల్లేకుండానే! అంబులెన్సు డ్రైవర్లు, సిబ్బంది కలిసి రూ.25 వేల నుంచి దాదాపు రూ.40 వేల వరకు తీసుకుని శవాలను కాల్చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఐదు విద్యుత్తు దహనవాటికల్లో, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో కరోనా మృతుల అంత్యక్రియలు గమనిస్తే కన్నీళ్లు రాకమానవు.

వీడియో కాల్స్‌ ద్వారా.. 
ఈ క్రమంలో గతంలో మనమెన్నడూ చూడని, గుండెను బరువెక్కించే అనేక సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కొందరు తమ కుటుంబసభ్యుల అంత్యక్రియలను వీడియో కాల్స్‌ ద్వారా చూస్తున్నారు. ఎలాగూ అంత్యక్రియలను చేతులారా నిర్వహించే అదృష్టం లేకపోవడంతో కనీసం అలాగైనా కడసారి చూసుకుంటున్నారు. వీడియోకాల్‌ కుదరనప్పుడు కొందరు వీడియో తీసి వాట్సాప్‌ ద్వారా పంపుతున్నారు.

అంబులెన్సు సిబ్బందితోనే..
కరోనా మృతుల అంత్యక్రియలకు కుటుంబసభ్యులే ముందుకు రావడం లేదు. కరోనా భయం, అనారోగ్య సమస్యలు.. ఇలా అనేక కారణాలున్నాయి. అంబులెన్స్‌ డ్రైవర్లతోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంబులెన్స్‌ సిబ్బంది కాస్త అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఒకేసారి ట్రాలీ ఆటోల్లో నాలుగైదు శవాలను కుప్పలుగా శ్మశానవాటికలకు తరలిస్తున్నారు. అక్కడ ముందే సిద్ధం చేసిన చితులపైన వీటిని వేసి అన్నింటిని ఒకేసారి కాల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్‌ సిబ్బంది పీపీఈ కిట్లు కూడా ధరించడం లేదు. కొందరు పీపీఈ కిట్లను పూడ్చిపెట్టకుండా అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. మరోవైపు పేదవారు అంబులెన్స్‌ డ్రైవర్లు అడిగినంత ఇచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

మరునాడే చితాభస్మం కోసం..
కుటుంబంలోని వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించలేని దయనీయ స్థితిలో ఉన్న కుటుంబసభ్యులు చితాభస్మం తీసుకెళ్లడంలో మాత్రం ఏమాత్రం జాప్యం చేయకపోవడం విశేషం. కట్టెల చితి అయినా, విద్యుత్తు దహనవాటిక అయినా.. శవాన్ని కొన్ని వందల డిగ్రీ సెల్సియస్‌ వద్ద గంటలపాటు కాలుస్తాయి. దీంతో శరీరంలో వైరస్‌ ఉండే అవకాశం లేదు. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉంది. అందుకే, శవం దహనం అయిన మరునాడే చితాభస్మం తీసుకెళ్లేందుకు వస్తున్నారు. ఇక ఆ తరువాత మిగిలిన తంతులను సజావుగా నిర్వహించుకుంటున్నారు.

పగోడికి కూడా ఈ దుస్థితి రావొద్దు
మా బాపు అంత్యక్రియల బాధ్యతలను అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఇచ్చాం. ఆయన రూ.30 వేలు అడిగిండు. మా దగ్గర అంత లేకుండే. బతిమిలాడితే రూ.20 వేలకు ఒప్పుకున్నడు. బాపు తోబుట్టువులు, సంతానం, వారి సంతానం కలిపి దాదాపు 100 మందికిపైగానే కుటుంబసభ్యులం ఉన్నం. కానీ, ఇప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేక ఇలా వేరేవాళ్లతో అంత్యక్రియలు చేయించాల్సి వచ్చింది. ఇలాంటి దుస్థితి పగోడికి కూడా రావద్దు. వాట్సాప్‌ల మా నాన్న అంత్యక్రియలు చూడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలే.    
– రమేశ్, కరీంనగర్‌

ఇంట్లో షుగరు, ఆస్తమా పేషెంట్లున్నారు
మా అమ్మకు 90 ఏళ్లు. కరోనాతో చనిపోయింది. నాకు, మా అన్నలకు షుగర్‌ ఉంది. మా పిల్లల్లో ఇద్దరికీ ఆస్తమా ఉంది. వాస్తవానికి నేనే చితికి నిప్పుపెట్టాల్సింది. కానీ, ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తే ఇంట్లో అందరి ప్రాణాలకు ప్రమాదమే. అందుకే, రూ.25 వేలు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌కి ఇచ్చి అంత్యక్రియలు చేయించాం. అతను వీడియో కాల్‌ చేస్తే కడసారి మా అమ్మను చూసుకున్నం.
– యాదగిరి, పాతబస్తీ, హైదరాబాద్‌

సీఎస్‌కి లేఖ రాశాం
అంబులెన్స్‌ సిబ్బంది డబ్బులు తీసుకుని అంత్యక్రియలు నిర్వహించడం ఒక విధంగా మంచి కార్యక్రమే. కానీ, ఇది ఇలాగే కొనసాగితే వ్యాపారంగా మారే ప్రమాదముంది. అందుకే, కరోనా శవాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యతను ఆసక్తి, సేవాభావం ఉన్న స్వచ్ఛంద సంస్థకు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాం. అలా జరిగినప్పుడే పేదలతోపాటు అన్ని వర్గాల వారు దోపిడీ నుంచి ఉపశమనం పొందుతారు. 
– రాజేశ్వర్‌రావు, సత్యహరిశ్చంద్ర ఫౌండేషన్‌

ఇంట్లో షుగరు, ఆస్తమా పేషెంట్లున్నారు
మా అమ్మకు 90 ఏళ్లు. కరోనాతో చనిపోయింది. నాకు, మా అన్నలకు షుగర్‌ ఉంది. మా పిల్లల్లో ఇద్దరికీ ఆస్తమా ఉంది. వాస్తవానికి నేనే చితికి నిప్పుపెట్టాల్సింది. కానీ, ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తే ఇంట్లో అందరి ప్రాణాలకు ప్రమాదమే. అందుకే, రూ.25 వేలు ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌కి ఇచ్చి అంత్యక్రియలు చేయించాం. అతను వీడియో కాల్‌ చేస్తే కడసారి మా అమ్మను చూసుకున్నం.
– యాదగిరి, పాతబస్తీ, హైదరాబాద్‌ 

చదవండి: కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement